
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు పారదర్శకంగా సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ చట్టం–1989 (సవరణ చట్టం–2015) అమలుపై రాష్ట్రస్థాయి హైపవర్ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం (వర్క్‌షాప్) శుక్రవారం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రెవెన్యూ, పోలీస్, ప్రాసిక్యూషన్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు హాజరైన ఈ వర్క్‌షాప్‌ను డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, బాలల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గట్టి చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.
వీటిపై ఎప్పటికప్పుడు ఆయన తమకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. సామాజిక మార్పు, చైతన్యం తీసుకురావడం కోసం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రాసిక్యూషన్, పోలీస్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ విభాగాలు ప్రధాన స్తంభాలుగా నిలబడి సమన్వయంతో పనిచేస్తే ఎస్సీ, ఎస్టీ కేసుల్లో సత్వర న్యాయం అందించవచ్చన్నారు. ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఏపీఎస్‌సీసీఎఫ్‌సీ వైస్ చైర్మన్, ఎండీ శామ్యూల్ ఆనంద్‌కుమార్, హైకోర్టు రిజి్రస్టార్ భానుమతి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ పాల్గొన్నారు.