ధాన్యం రైతుకు దగా! | The government has completely failed to provide support price to the farmer | Sakshi
Sakshi News home page

ధాన్యం రైతుకు దగా!

Published Sat, Dec 7 2024 4:37 AM | Last Updated on Sat, Dec 7 2024 7:59 AM

The government has completely failed to provide support price to the farmer

చరిత్రలో తొలిసారిగా సర్కారు దళారీ అవతారం

రైతుకు మద్దతు ధర ఇప్పించడంలో పూర్తిగా విఫలం

రైతుసేవా కేంద్రాల్లో దళారులు, మిల్లర్ల పాగా

అక్కడి నుంచే ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ పర్వం

75 కేజీల బస్తాకు కేవలం రూ.1,200–రూ.1,400 మాత్రమే చెల్లింపు

బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్న అన్నదాత

ఎకరాకు దాదాపు రూ.9వేలకు పైగానే నష్టం 

ఆరుగాలం శ్రమను దోచేస్తుండటంతో రోడ్డెక్కుతున్న రైతులు

తొలిసారిగా బీపీటీ సన్న ధాన్యం రకాలకూ పడిపోయిన ధర 

ఎంటీయూ–1262, 1318 రకాలను కొనుగోలు చేయట్లేదని రైతుల ఆందోళన

50 శాతం పంట కూడా ఈసారి కొనుగోలు చేసే పరిస్థితి కనిపించట్లేదు

రైతుల నిలదీతలతో జిల్లాల్లో పర్యటించాలంటే భయపడుతున్న మంత్రులు

మొక్కబడి సమీక్షలతో సరిపెడుతున్న సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: ‘ఎందుకు ఇబ్బంది పడతారు. మిల్లరు చెప్పిన రేటుకు ధాన్యం ఇచ్చేయండి. మిల్లరు అనుమతిలేకుండా మీ ధాన్యం రోడ్డెక్కదు. మా చేతుల్లోనూ ఏమీలేదు..’ అంటూ ఆరుగాలం కష్టించి వరిపంట పండించిన అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారిని ఇలా డీలాపరుస్తూ నిండా ముంచేస్తోంది.

చరిత్రలో ఎన్నడూలేనివిధంగా దళారీగా మారి రైతుకు మద్దతు ధర దక్క­కపోవడానికి కారణమవు­తోంది. రైతుసేవా కేంద్రాల్లో అన్నదాతలకు ప్రభుత్వ సేవలు అందించకపోగా వాటిని దళారీలు, మిల్లర్లకు అడ్డాగా మార్చేసింది. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ అన్నదా­తలు మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్నారు. 

దళారీకి ‘ధర’హాసం..!
ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. సకాలంలో ధాన్యాన్ని తరలించకుండా వారు దళారులను ఆశ్రయించాల్సిన పరి­స్థితి కల్పిస్తోంది. దీంతో దళారులు, మిల్లర్లు మద్దతు ధరకు భారీగా కోత పెడుతున్నారు. 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1,725, ఏ–గ్రేడ్‌కు రూ.1,740­గా మద్దతు ధర నిర్ణయిస్తే.. తేమ శాతం పేరుతో మిల్లర్లు రూ.1,200–1,400కు పరిమితం చేస్తున్నారు. మళ్లీ తిరిగి అదే ధాన్యాన్ని.. అదే రైతు పేరుతో ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధర కొట్టేస్తున్నారు. 

ఇలా బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు అన్నదాతలు నష్టపోతున్నారు. ఎకరాకు ఒక్కో రైతు సుమారు రూ.9వేలకు పైగా మద్దతు ధరను కోల్పోతున్నారు. పైగా.. రైతులకిచ్చే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు (జీఎల్టీ) ఊసేలేదు. ఫలితంగా వారిపై అదనపు భారం పడుతోంది. నిజానికి.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం, అంతకంటే తక్కువ తేమ శాతం ఉంటే సంపూర్ణ మద్దతు ధర కల్పించాలి. కానీ, రైతుసేవా కేంద్రాల్లో తేమ పరీక్షలు చేయకపోవడంతో మిల్లర్లు పేట్రేగిపోయి రైతులను దోచేస్తున్నారు.

చిక్కిపోతున్న ‘సన్నాల’ ధర..
ఇక కూటమి ప్రభుత్వంలో సాధారణ రకాలకే మద్దతు ధర లేదంటే.. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సన్నాలు (ఫైన్‌ వెరైటీలు) ధర కూడా చిక్కిపోతోంది. గోదావరి డెల్టాలో బీపీటీ సాంబ మసూరి రకాన్ని వేసిన రైతులకు దళారులు చుక్కలు చూపిస్తున్నారు. కోసిన పంటను ఆరబెట్టుకుంటే 75 కిలో బస్తా రూ.2,500 వరకు వస్తుందని రైతులు ఆశించారు. కానీ, ఫెంగల్‌ తుపాను దెబ్బకు 75 కేజీల బస్తా రూ.1,400, రూ.1,500కి మించి పలకడంలేదు. కడప ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. 

అలాగే, కృష్ణా డెల్టాలో అధికంగా ఎంటీయూ–1262, ఎంటీయూ–1318 సూపర్‌ఫైన్‌ వెరైటీ రకాలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదు. తేమ శాతంవల్ల ధాన్యంలో ముక్కు విరుగుడు ఎక్కువగా ఉండటంతో మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. తక్కువ ధరకు ధాన్యం కొనే వ్యాపారస్తులపై కేసులు పెడతామని హూంకరిస్తోందే తప్ప.. ఒక్కరిపై కూడా అలా చేసిన దాఖలాల్లేవని రైతులు మండిపడుతున్నారు.

కొనుగోళ్లు 50% కూడా లేవు..
రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో 80 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 50 శాతం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. ఎందుకంటే.. చాలా రైతుసేవా కేంద్రాల్లో అన్నదాతలు ధాన్యం తీసుకెళ్తే ‘టార్గెట్‌ అయిపోయింది. ప్రభు­త్వం అనుమతిస్తే ధాన్యం కొంటాం.. లేదంటే దళా­రికి అమ్ముకోండి’ అనే సమాధానం వస్తోంది. ఉన్న­తాధికారుల నుంచి దాదాపు సహాయ నిరాకరణే ఎదురవుతోంది. 

ఇప్పటికీ చాలా గ్రామాల్లో కొను­గోలు కేంద్రాలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. మరోవైపు.. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు విషయంలోనూ సర్కారు ప్రకటనలు గందరగోళ పరుస్తున్నాయి. 37 లక్షల టన్నులని ఒకసారి.. 32 లక్షల టన్నులని మరోసారి.. 35 లక్షల టన్నులు అంటూ ఇంకోసారి ఇలా పొంతనలేని ప్రకటనలు ఇవ్వడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. 

అప్పట్లో ప్రత్యేక రకంగా పరిగణించి..
నిజానికి.. వాతావరణ పరిస్థితులను బట్టి ధాన్యం రకాల్లో ముక్క విరుగుడు సమస్య వస్తుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రైతులకు నష్టంలేకుండా చర్యలు చేపట్టింది. ముక్క విరుగుడు ధాన్యాన్ని..  మొలక, రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని ప్రత్యేక రకంగా పరిగణించి పూర్తి మద్దతు ధరకు కొనుగోలు చేసింది. 

ఆ ధాన్యాన్ని బాయిల్డ్‌ మిల్లులకు తరలించి మిల్లర్లకు, రైతులకు నష్టంలేకుండా చూసింది. అలాగే, మిల్లర్ల మోసం నుంచి రైతులను కాపాడేందుకు.. మొబైల్‌ మిల్లింగ్‌ యంత్రాలు పెట్టి వ్యవసాయ క్షేత్రం వద్దే శాంపిల్‌ ధాన్యాన్ని మరాడించి ముక్క విరుగుడు శాతాన్ని పరిశీలించి స్వయంగా మిల్లుకు తరలించేది. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ధాన్యం రవాణా వ్యవస్థ పూర్తిగా మిల్లర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.   

మంత్రులకు నిరసన సెగ..
ఎక్కడికక్కడ ధాన్యం రైతులు రోడ్డెక్కడంతో కూటమి ప్రభుత్వంలోని మంత్రుల్లో గుబులు మొదలైంది. జిల్లాల్లో పర్యటనలకు వెళ్లిన ప్రతిచోటా అన్నదాతలు నిలదీస్తుండడంతో కంగుతింటున్నారు. ఫెంగల్‌ తుపాను నేపథ్యంలో రైతాంగం అతలాకుతలమైతే ఒక్క మంత్రి కూడా స్పందించిందిలేదు. ఇక వాట్సాప్‌ ద్వారా రైతులు ‘హాయ్‌’ అని చెబితే గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు చేస్తామని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేసిన ప్రకటన మాటలకే పరిమితమైంది. 

కృష్ణా జిల్లాలో ఆయన పర్యటించి.. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సాయంత్రానికల్లా కాటావేసి మిల్లులకు తరలించాలని చిటికలేసి మరీ చెప్పారు. కానీ, ఒక్క గింజ కూడా కాటా వేయలేదు. ఇక బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు గురువారం వెళ్తే.. ‘పండించిన పంటను కొనడానికి ముప్పతి­ప్పలు పెడుతున్నారు. 

మిల్లర్లే దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు’ అంటూ రైతులు తిరగబడడంతో మంత్రులు షాకయ్యారు. మరోవైపు.. సీఎం సైతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మొక్కుబడి సమీక్షలు చేస్తుండటం గమనార్హం.

‘కౌలు’కోలేని దెబ్బ!
» ధాన్యం కొనుగోళ్లలో కౌలు రైతులకే భారీ నష్టం
»పంట ఎంత నష్టానికి అమ్ముకున్నా పూర్తి కౌలు చెల్లించక తప్పని పరిస్థితి
» పెట్టుబడి ఖర్చులు, కౌలు చెల్లించగా రైతుకు చి‘వరి’కి మిగిలేది అప్పే
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు కౌలు చెల్లించి, పెట్టుబడికి అప్పులుచేసి సాగుచేస్తే.. తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా దళారులు, మిల్లర్లు వారినీ ముంచేస్తున్నారు. 

రాష్ట్రంలో మొత్తం పాతిక, ముప్పై లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. కానీ, ఇటీవల ప్రభుత్వ అధికారిక ప్రకటనల ప్రకారం 16 లక్షల మందిని కౌలు రైతులుగా తేల్చారు. వారిలో 9.30 లక్షల మందికి పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్సీ కార్డు) జారీచేశారు. వీరికే నామమాత్రంగా మద్దతు ధర దక్కుతోంది. అవిలేని కౌలు రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. 

ఇదీ కౌలు రైతుల దుస్థితి..
సాధారణంగా ఒక ఎకరా వరి సాగుకు రూ.35 వేలు వరకు ఖర్చవుతుంది. క్వింటా సాధారణ రకానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర రూ.2,300గా నిర్ణయించారు. ఈ లెక్కన సగటున 35–40 (ఒక్కోటి 45 కిలోలు) బస్తాల దిగుబడి వస్తే ఎకరాకు రూ.36,225 నుంచి రూ.41,400 రావాల్సి ఉంటుంది. కానీ, రూ.28,225 నుంచి రూ.32,400 మాత్రమే దక్కుతోంది. ఇందులో మళ్లీ కౌలు 15 బస్తాల సొమ్మును భూ యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మద్దతు ధర ఎంత ఉందో అదే మొత్తాన్ని భూ యజమానికి ఇవ్వాల్సి వస్తోంది. 

అంటే.. సుమారు రూ.15 వేలు చెల్లిస్తు­న్నారు. ఈ లెక్కన కౌలు రైతుకి రూ.21,225 నుంచి రూ.26,400 మాత్రమే మిగులుతోంది. ఖరీఫ్‌లో రూ.8,600 లోటు ఏర్పడుతోంది. ఈ లోటును రెండో పంటలో పూడ్చుకుంటే సరాసరి సరిపోతుంది. ఆ సమయంలోనూ అకాల విపత్తులు వచ్చి పంట నష్టపోతే కౌలు రైతుకు చి‘వరి’కి అప్పే మిగులు­తోంది. మరోవైపు.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ విధానం కౌలు రైతుల పాలిట శాపంగా మారుతోంది. 

వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల్లో చాలా­మందికి గుర్తింపు కార్డుల్లేని కారణంగా వారి నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని తెగేసి చెబుతోంది. ఈ క్రమంలో దళారులు, మిల్లర్లు మద్దతు ధరను మరింత తగ్గిస్తున్నారు. కౌలు రైతుల్లో కొందరు భూయజమానుల పేరుతో విక్ర­యి­ద్దామంటే కొనుగోలు సమయంలో భూయజ­మాని వేలిముద్రలు తప్పనిసరి చేశారు. పైగా.. చాలామంది కౌలుకు ఇచ్చే వ్యక్తులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్నారు. వాళ్లు వచ్చే వీలులేకపోవడంతో ప్రభుత్వానికి అమ్ముకోలేక కౌలురైతులు అవస్థలు పడుతున్నారు.

తేమ శాతం పేరుతో దోపిడీ..
రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే కౌలురైతులు తీవ్రంగా నష్టపోతు­న్నారు. భూయజమానులతో మాట్లాడి కౌలురైతులు పంటలు అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి. సీసీఆర్సీ కార్డులు లేనందున భూ యజమానులు పేరుపై పంటను విక్రయించుకోవడానికి వీలుండట్లేదు. ఇదే అదనుగా దళారులు మద్దతు ధరను దారుణంగా తగ్గిస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో 75 కిలో బస్తాను రూ.1,300 నుంచి రూ.1,400కే అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు.  – పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement