సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పిల్లలందరూ చదువుకొనేలా నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధనకు ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను సమర్ధంగా వినియోగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 5 నుంచి 18 సంవత్సరాల వయస్సుగల పిల్లలను గుర్తించేందుకు సచివాలయాల పరిధిలోని వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తోంది.
పిల్లలు స్కూళ్లు, విద్యా సంస్థల్లో చేరారా లేదా అనే సమాచారాన్ని సేకరిస్తోంది. స్కూళ్లలో చేరని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు వలంటీర్లు నచ్చజెప్పి, వారిని స్కూలుకు పంపేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం సచివాలయాలు, వలంటీర్ల మధ్య సానుకూల పోటీతత్వాన్ని తెస్తున్నారు. సచివాలయాల పరిధిలో నూరు శాతం జీఈఆర్ సాధించిన వలంటీర్లకు ప్రత్యేకంగా ఈ–బ్యాడ్జ్‌తో గుర్తింపు ఇస్తారు. నూరు శాతం జీఈఆర్ సాధించిన సచివాలయాలకు కూడా ఈ – బ్యాడ్జ్ ద్వారా గుర్తింపు ఇస్తారు.
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ద్వారా అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, నాడు–నేడు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యారంగంలో సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో భాగంగా 2023 –24 విద్యా సంవత్సరంలోనే నూరు శాతం జీఈఆర్ సాధించాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణంగా 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది, అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికే ఈ లక్ష్యాన్ని సాధించనుంది.
నూరు శాతం జీఈఆర్ మిషన్
నూరు శాతం జీఈఆర్ మిషన్ పేరుతో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. 2005 సెపె్టంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించిన పిల్లలు, వారి గృహాల సమాచారాన్ని స్థిరమైన రిథమ్ యాప్‌లో వలంటీర్లకు అందించారు. ఈ డేటా ఆధారంగా 5 నుంచి 18 సంవత్సరాల వయస్సుగల పిల్లలు ఏదైనా స్కూళ్లలో లేదా కాలేజిలో చేరారా లేదా? ఆ సచివాలయ పరిధిలో ఉండాల్సిన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లారా? అక్కడ స్కూల్లో చేరారా లేదా అనే వివరాలు సేకరిస్తారు.
స్కూల్లో చేరని పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ పిల్లలను స్కూల్లో చేర్పిస్తారు. ఇలా స్కూళ్లు, విద్యా సంస్థల్లో చేర్పించిన పిల్లల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన విద్యార్థుల సమాచార పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ పిల్లల పేర్లు ఎదురుగా గ్రీన్ టిక్ పెడతారు. పిల్లలు స్కూళ్లలో చేరకపోతే వారి పేర్లు ఎదురుగా ఖాళీ వదిలిపెడతారు. ఇలా పిల్లల పూర్తి సమాచారం పోర్టల్‌లో నమోదవుతుంది.
దీని ద్వారా వలంటీరు వారి పరిధిలో నూరు శాతం జీఈఆర్ సాధిస్తే వారిని గుర్తిస్తూ ఈ–బ్యాడ్జ్ ఇస్తారు. అలాగే సచివాలయాల పరిధిలో వలంటీర్లందరూ నూరు శాతం జీఈఆర్ సాధిస్తే ఆ సచివాలయాలకు కూడా ఈ–బ్యాడ్జ్ ఇస్తారు. ఇటీవల సీఎస్ డా. కేఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నూరు శాతం జీఈఆర్ సాధించడం, సర్వేపై సమీక్షించారు. వివిధ శాఖలు నిర్వహించే విద్యార్థుల ప్రవేశాల వివరాలన్నీ పోర్టల్‌లో నమోదు చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment