స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయనున్న ప్రభుత్వం
లోడింగ్, రవాణా చార్జీలను మాత్రమే వసూలు చేస్తామంటున్న అధికారులు
ఈ చార్జీలు ఎంతో ఇప్పటికీ వెల్లడించని వైనం
వాహనాలు, లోడింగ్ వ్యవస్థ అంతా వారి గుప్పెట్లోనే..
ఈ ముసుగులో దండుకునేందుకు టీడీపీ నేతల పక్కా వ్యూహం
వర్షాకాలం కావడంతో వచ్చే మూడు నెలలు ఇసుక తవ్వకాలు నిలిపివేత
మళ్లీ సెప్టెంబర్ నుంచి తవ్వకాలకు కొత్త విధానం ప్రకటించనున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఉచితంగా ఇసుక పేరుతో అందినకాడికి దండుకోవడానికి అధికార పార్టీ నేటి నుంచి ముసుగు తీయనుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినా స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుక నిల్వలను నేటి నుంచి అవసరమైన వారికి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఆ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే పరిస్థితి ఉండడంతో కొరత రాకుండా ఉండేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాక్ పాయింట్లలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసింది.
ఇప్పుడు ఆ ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఆ ముసుగులో ఆ పార్టీ నేతలకు భారీగా లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమైంది. పైకి మాత్రం వినియోగదారులే సొంతంగా వాహనాన్ని సమకూర్చుకుంటే, అందులో ఉచితంగా ఇసుకను నింపి పంపుతారని అధికారులు చెబుతున్నప్పటికీ అది ఆచరణలో మరో రకంగా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. ఇసుక లోడింగ్, స్టాక్ యార్డ్ నిర్వహణ, రవాణా, పన్నులు, లెవీకి సంబంధించి కొంత మొత్తాన్ని వసూలు చేయనున్నారు.
వీటన్నింటికీ కలిపి జీఎస్‌టీ కూడా వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపి టన్నుకు రూ.250 నుంచి రూ.300 వరకు వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నా, వాస్తవంగా అంతకు రెట్టింపు వసూలు చేయనున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టన్నుకు రూ.475తో ఇసుకను విక్రయించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.780 కోట్లకుపైగా ఆదాయం లభించేది.
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొత్తగా అమలు చేసే విధానంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. అదే సమయంలో వినియోగదారులపై భారం తప్పదు. ‘వాహనాలన్నీ టీడీపీ నేతలవే.. అలాంటప్పుడు ఆ పన్ను, ఈ పన్ను అంటూ బాదుడు మామూలే’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
సచివాలయ ఉద్యోగులకు స్టాక్ యార్డ్ బాధ్యతలు
ఇసుక స్టాక్ యార్డు బాధ్యతలను ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కాంట్రాక్టు సంస్థలుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమి ఇన్‌ఫ్రా సంస్థలకు చెందిన సిబ్బందిని గత నెల అధికారం మారగానే టీడీపీ శ్రేణులు బెదిరించి అక్కడి నుంచి పంపించేశాయి. స్టాక్ యార్డులన్నీ ప్రస్తుతం టీడీపీ శ్రేణుల చేతిలో ఉన్నాయి. ఉచిత ఇసుక సరఫరాను అమలు చేయడం కోసం శనివారం నుంచి జిల్లా కలెక్టర్లు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కొలిక్కి వచ్చినట్లు లేదు.
మైనింగ్ సిబ్బందితోపాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి వాటిని అప్పగించనున్నట్లు తెలిసింది. వారితోపాటు వీఆర్‌ఓ, వీఆర్‌ఏల ద్వారా ఇసుకను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి స్టాక్ యార్డ్‌రే ఒక ఇన్‌ఛార్జిని నియమించి, అతని ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ సిబ్బంది కొందరు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో సెప్టెంబర్ వరకు ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అప్పటి వరకు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుక నిల్వల్ని ఉచిత ఇసుక విధానంలో సరఫరా చేయనున్నారు.
ఆ తర్వాత ఇసుక రీచ్‌లను తెరిచి తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఇసుక కాంట్రాక్టు సంస్థలు జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలను పక్కకు తప్పించి ఇసుక తవ్వకాలకు కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇసుక స్టాక్ యార్డులను స్థానిక టీడీపీ లీడర్లే నిర్వహించనున్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల పాత్ర నిమిత్త మాత్రమేనని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment