ఏలూరు టౌన్: వినోద రంగంలో ఓవర్ ద టాప్ (ఓటీటీ) కీలక భూమి పోషిస్తోంది. కరోనాతో పాత పద్ధతులకు భిన్నంగా నూతన మార్గాలపై యువత మొగ్గుచూపుతోంది. టీవీ సీరియళ్లను మరిపించేలా వెబ్‌సిరీస్‌లు, థియేటర్లలో విడుదల కాని సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఓటీటీల వినియోగం బాగా పెరిగింది. సెల్‌ఫోన్‌లో యాప్‌ల ద్వారా యువత, విద్యార్థులు అరచేతిలో వినోదాన్ని పొందుతున్నారు. ఇది వ్యసనంలా మారితే మానసిక, శారీరక ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రూ.500లోపు ఖర్చుతో..
కరోనా కాలంలో ఓటీటీ (ఓవర్ ద టాప్) హవా విపరీతంగా పెరిగిపోయింది. మొన్నటివరకూ సినిమా థియేటర్లు సైతం మూసివేయడంతో వినోద ప్రియుల చూపు ఓటీటీలపై పడింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, ఆహా, జీ5, సోనీ లివ్, వూట్ వంటి ఓటీటీ చానల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల దృష్టి పడింది. ముఖ్యంగా యువత అత్యధికంగా వీటిని వినియోగిస్తున్నారు. ఏడాదికి కేవలం రూ.500లోపు మాత్రమే సబ్‌స్రిప్షన్ చెల్లిస్తే ఐదుగురు నుంచి పదిమంది వరకూ వారి సెల్‌ఫోన్లలో లాగిన్ అయ్యి వీక్షించే అవకాశం ఉండటంతో వీటి వినియోగం బాగా పెరిగింది.
‘వెబ్‌సిరీస్’ మాయాజాలం
సరికొత్త సినిమాలతోపాటు హాలీవుడ్ సినిమాలకు తీసిపోని విధంగా రూపొందుతున్న వెబ్‌సిరీస్‌పై యువత అమితాసక్తి చూపుతోంది. కొన్ని సిరీస్‌ల కోసం ప్రత్యేకంగా ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. నేరం, మాఫియా, ఆర్థిక నేరాలు, రాజకీయ నేపథ్యాల సిరీస్‌లు ఎక్కువగా వీరిని ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో సిరీస్‌లో పది నుంచి పదిహేను ఎపిసోడ్లు ఉండటం, రెండు, మూడు ఎపిసోడ్‌లను ఒకేసారి విడుదల చేస్తూ ఉండటంతో వీక్షకులు రెట్టింపు అవుతున్నారు. ఓ మాయాజాలంలా ఓటీటీల విస్తృతి పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యసనంలా మారుతోంది
సెల్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్నే చుట్టిరావచ్చు. సెల్‌ఫోన్ ఆన్‌లైన్ వినియోగం అనర్థాలకు దారితీస్తోంది. యువత, విద్యార్థులు వెబ్‌సిరీస్‌లకు బానిసలవుతున్నారు. వ్యసనంలా మారిపోవటం ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక సమయం నేర సంబంధిత సిరీస్‌లు చూడటంతో ఏకాగ్రత కోల్పోవటం, ప్రతికూల ఉద్వేగాలకు లోనుకావటం, కోపం, ఆందోళనలు, అసహనం వంటి మానసిక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. గంటల తరబడి సెల్‌ఫోన్లు చూడటంతో శారీరక సమస్యలు తప్పవు. తల్లిదండ్రులు గుర్తించి మొదట్లోనే పిల్లలు వాటికి బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
–అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, తణుకు
కంటి సమస్యలు
మనిషికి వెలుగు కన్ను. కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఏకధాటిగా సెల్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటివి చూస్తూ ఉంటే దాని ప్రభావం కంటిపై పడుతుంది. పిల్లలు, పెద్దల్లో ప్రధానంగా డ్రై ఐ అనే సమస్య ఏర్పడుతుంది. మయోఫియా అనే సమస్యకూ దారితీసే అవకాశం ఉంది. మైనస్ కళ్లజోడు వేయించుకోవాల్సిన ఇబ్బంది ఏర్పడుతుంది. అల్ట్రావయోలెట్ కిరణాల కారణంగా కంటి రెటీనా దెబ్బతిని మెల్లగా కంటికి సంబంధించిన తీవ్ర సమస్యలు బాధిస్తాయి. కంటికి రెప్పలా.. మన కంటిని మనమే కాపాడుకోవాలి.
–డాక్టర్ ఏఎస్ రామ్, కంటివైద్య నిపుణులు, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment