నేటినుంచి 3 రోజులు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది. ఈ నెల 31న విశాఖపట్నం సమీపంలో తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయి.
తీవ్ర అల్పపీడనం తీరం దాటిన తర్వాత.. మరింత బలపడి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తూ సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
శుక్ర, శనివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment