
సాక్షి, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుల నియామకంపై దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు జారీచేసిన నోటీసులను పాలక మండలి సభ్యుడు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అందుకోకపోవడంతో అతనికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు అందజేయాలంటూ తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం వెనక్కి తీసుకుంది. నోటీసులు అందుకోనందుకు రాంభూపాల్‌రెడ్డి క్షమాపణ కోరడంతో ధర్మాసనం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. నోటీసులు అందుకోని పాలక మండలి సభ్యులు అల్లూరి మల్లీశ్వరి, ఏఎన్ శశిధర్‌లకు పత్రికా ప్రకటనల ద్వారా నోటీసులు జారీచేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. టీటీడీ పాలకమండలి సభ్యు ల్లో పలువురికి నేరచరిత్ర ఉందంటూ వారి నియామ కాన్ని సవాలుచేస్తూ బీజేపీ నేత జి. భానుప్రకాశ్‌రెడ్డి గత ఏడాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం పాలక మండలి సభ్యులందరికీ నోటీసులు ఇచ్చింది.
ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా, నోటీసులు అందుకోని వారికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు అందజేయాలంటూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాంభూపాల్‌రెడ్డి.. తన కుటుంబంలో వివాహ కార్యక్రమంవల్ల నోటీసు అందుకోలేకపోయానని, అందుకు క్షమించాలని, పత్రి కా ప్రకటన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువా రం విచారించిన సీజే ధర్మాసనం.. రాంభూపాల్‌రెడ్డి విషయంలో తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment