తుంగభద్ర నదికి పూజలు చేస్తున్న భక్తులు
కర్నూలు (అర్బన్): తుంగభద్ర నదీ తీరానికి భక్తజనం వెల్లువెత్తింది. నదీమ తల్లికి ప్రణమిల్లి.. పుష్కర స్నానాలు ఆచరించారు. పసుపు, కుంకుమలతో గంగమ్మను అర్చించి వాయనాలు సమర్పించారు. కర్ణాటక సరిహద్దులోని మేలిగనూరు మొదలుకొని సంగమేశ్వరం వరకు గల ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సూర్యోదయం నుంచే భక్తులు పోటెత్తారు. సమీపంలోని ఆలయాల్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరికొందరు పితృ దేవతలకు పిండ ప్రదానాలను జరుపుకున్నారు.
పుష్కరాలకు ఐదో రోజైన మంగళవారం వీఐపీల తాకిడి తగ్గగా.. 50 వేల మందికి పైగా సామాన్య భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. అన్ని ఘాట్లలో జల్లు స్నానాలు (షవర్లు) ఏర్పాటు చేయడంతో ప్రశాంతమైన వాతావరణంలో స్నానాలు చేస్తున్నామనే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలయం, సంగమేశ్వరం ఘాట్లకు యాత్రికులు భారీగా తరలివచ్చారు. కార్తీకమాసం పరమ శివునికి ప్రీతిపాత్రం కావడం వల్ల సంగమేశ్వరం ఘాట్‌లో స్నానం చేసి సంగమేశ్వరునికి అభిషేకాలు, ఇతర పూజలు నిర్వహించుకున్నారు.
లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లలో కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. అన్నిచోట్లా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అడుగడుగునా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment