కర్నూలులో నదీతీరాన తుంగభద్రమ్మకు పూజలు చేస్తున్న భక్తులు
కర్నూలు (అగ్రికల్చర్): ఒకపక్క కార్తీక సోమవారం.. మరోపక్క పుష్కర సమయం.. ఈ పవిత్రమైన రోజున తెలతెలవారుతూనే తుంగభద్ర తీరం ఆధ్యాత్మిక తరంగమైంది. కార్తీక దీపాలు, పుణ్యకార్యక్రమాలతో పుష్కర ఘాట్లలో సందడి నెలకొంది. పుష్కరాలకు నాలుగో రోజున తెలుగు రాష్ట్రాల నుంచే గాక వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కర్నూలు జిల్లాలోని పుష్కర ఘాట్లు నిండిపోయాయి. 23 పుష్కరఘాట్లకు ఉదయం 5 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలైంది. 75 వేల మందికిపైగా భక్తులు.. పవిత్ర జలాలను తలపై చల్లుకోవడం, జల్లు స్నానాలాచరించడం ద్వారా పులకించిపోయారు. నదిలో నీటి ప్రవాహం కొంతమేర పెరగడంతో జిల్లా యంత్రాంగం పుట్టిలను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. సిబ్బందిని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కర్నూలులోని సంకల్‌భాగ్, పంప్‌హౌస్, కర్నూలు మండలం సుంకేసుల ఘాట్లతో పాటు మంత్రాలయం, సంగమేశ్వరం ఘాట్లు భక్తులతో కిక్కిరిశాయి. కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌లో తుంగభద్ర నదీమతల్లికి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి: కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప సుంకేసుల పుష్కరఘాట్‌ను సందర్శించారు. పంచలింగాల పుష్కరఘాట్‌ను ప్రభుత్వ విప్ కె.శ్రీనివాసులు సందర్శించారు. ఆయన వెంట కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఉన్నారు. సుంకేసుల ఘాట్‌ను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి దంపతులు సందర్శించారు. పుష్కరాల కోసం కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. పుష్కర స్నానం తర్వాత రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. సంకల్‌భాగ్ ఘాట్‌లో తుంగభద్ర నదికి సాయంత్రం 6 గంటలకు వేదపండితులు పంచహారతులు ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో 3 పుష్కరాలు రావడం గొప్ప విశేషం
శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదుల పుష్కరాలు రావడం గొప్ప విశేషమని విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సోమవారం ఆయన కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, దండ తర్పణ చేశారు. శారద పీఠం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి.. పవిత్ర పుష్కర జలాలతో సంప్రోక్షణ చేసుకున్నారు. విశ్వశాంతి యాగంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీమన్నారాయణుని అవతారమైన వరాహమూర్తి ఇరు దంతాల నుంచి తుంగ, భద్ర నదులు ఉద్భవించాయని, అలాంటి నదికి పుష్కరాలు రావడం గొప్ప విశేషమన్నారు. పుష్కరాల సమయంలో 12 రోజుల పాటు నదిలో ముక్కోటి దేవతలు నిక్షిప్తమై ఉంటారని, స్నానమాచరించినా, సంప్రోక్షణ చేసుకున్నా వారి ఆశీస్సులు లభిస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment