విశాఖ బీచ్‌లో భారీ చెక్కపెట్టె.. ఇంతకీ ఆ బోషాణంలో ఏముంది? | Huge Wooden Box Found In Visakhapatnam Rk Beach | Sakshi
Sakshi News home page

విశాఖ బీచ్‌లో భారీ చెక్కపెట్టె.. ఇంతకీ ఆ బోషాణంలో ఏముంది?

Published Sun, Oct 1 2023 8:01 AM | Last Updated on Sun, Oct 1 2023 10:34 AM

Huge Wooden Box Found In Visakhapatnam Rk Beach - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరానికి భారీ బోషాణం (చెక్క పెట్టె) కొట్టుకు రావడం కలకలం రేపింది. ఆ పెట్టెలో ఏముందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందులో భారీ ఎత్తున నిధులు ఉండే అవకాశం ఉందని కొందరు.. స్మగ్లర్లు విలువైన వస్తువుల్ని అందులో దాచి ఉంటారని ఇంకొందరు.. శత్రు దేశాలు విధ్వంసం సృష్టించేందుకు పంపించిన బాక్స్‌ అని మరికొందరు పేర్కొనడంతో శుక్రవారం రాత్రంతా బాంబ్‌ స్క్వాడ్‌ సాయంతో పోలీసులు పహారా కాశారు.

శనివారం ఉదయానికి ఈ సమాచారం ఆ నోటా.. ఈ నోటా ప్రచారం కావడంతో భారీ పెట్టెను చూసేందుకు వేలాదిగా జనం ఎగబడ్డారు. చివరకు అది సముద్రం మధ్య నౌకల లంగర్‌ వేసేందుకు వినియోగించే స్లీపర్‌ బార్జ్‌ (చెక్క దిమ్మె)గా నిర్థారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..

అలల ఒడిలో.. భారీ వస్తువు! 
విశాఖ సాగర తీరంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అలల మధ్య భారీ వస్తువేదో కదులుతున్నట్టు సందర్శకులు గుర్తించారు. తొలుత అది భారీ సముద్ర జంతువు అని భయాందోళన చెందారు. ఒడ్డుకు పరుగులు తీశారు. రాత్రి పహారాకు బీట్‌ కానిస్టేబుళ్లకు కొందరు సమాచారం అందించగా.. అది ఒక భారీ చెక్క పెట్టె అని గుర్తించారు. చైనా, పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏవైనా పేలుడు పదార్థాలున్నాయా అని భయాందోళనలకు గురయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలెర్ట్‌ అయిన సిటీ సెక్యూరిటీ వింగ్‌ పొక్లెయిన్ల సాయంతో బాక్స్‌ను ఒడ్డుకు తీసుకొచ్చింది.

అది పురాతన బాక్స్‌గా కనిపించడంతో అందరి అనుమానాలు మరింత బలపడ్డాయి. కొందరు బాంబులు ఉన్నాయేమో అని భయపడగా.. భారీ నిధితో కూడిన పెట్టె ఒడ్డుకు వచి్చందని మరికొందరు భావించారు. భద్రతా బలగాలు బీచ్‌కు చేరుకుని ప్రజల్ని అప్రమత్తం చేశాయి. బీచ్‌ రోడ్డుని క్లియర్‌ చేశాయి. శనివారం ఉదయం ఆ భారీ పెట్టె మిస్టరీని ఛేదించేందుకు బాంబు డిస్పోజల్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగాయి. చేతులతో దానిని తెరిచేందుకు బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌ ప్రయత్నించగా.. సాధ్యం కాలేదు. బాంబ్‌ స్క్వాడ్‌ జాగిలాలతో చెక్‌ చేశారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని గుర్తించారు. జీవీఎంసీ ప్రాజెక్ట్‌ వర్క్‌ చేస్తున్న రెండు పొక్లెయిన్లను పోలీసులు రంగంలోకి దించారు.

14 గంటల నిరీక్షణ తరువాత..
సమాచారం అందుకున్న ఆర్కియాలజీ బృందం చేరుకుని బాక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. ఇది పురాతన కాలం నాటి పెట్టె కాదని.. రెండు నుంచి నాలుగేళ్ల క్రితం బర్మా టేకుతో తయారు చేసిన పెట్టె అని నిర్థారించింది. 10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల దానిని విడదీసేందుకు ప్రయత్నించగా.. చివరకు అది కేవలం చెక్క దిమ్మెగా గుర్తించారు.

ఆర్కియాలజీ బృందంతో పాటు మత్స్యకారులు, పోర్టు అధికారుల­తో పోలీ­సులు  సంప్రదింపులు  జరపగా.. అది నౌకల్లో వినియోగించే స్లీపర్‌ బార్జ్‌ అని స్పష్టమైంది. చిన్న సైజు నౌకలు అలల తాకిడికి గురై­న­ప్పుడు అవి దెబ్బ తినకుండా కర్రలతో చేసిన స్లీపర్‌ బార్జ్‌లను ఒక బ్లాక్‌గా బిగించి వినియోగిస్తారని తేలింది. సముద్రం మధ్యలో షిప్‌లని లంగరు వేసేందుకు వీటిని ఉపయోగిస్తారని తెలిసింది.

కంటైనర్‌ కార్గో వెసల్స్‌ నుంచి కంటైనర్లను దించే సమయంలోనూ ఈ తరహా బార్జ్‌లను వినియోగిస్తుంటారనీ.. వాటిలో ఒకటి షిప్‌ నుంచి విడిపోయి ఇలా కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి విశాఖ నగరానికి 14 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా.. ఓవైపు ఆందోళనల్ని.. మరోవైపు ఉత్కంఠని కలిగిస్తూ.. యాక్షన్‌ సినిమా తలపించిన భారీ చెక్క కథ సుఖాంతమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
చదవండి: మత్స్యకారులకు కష్టాలుండవిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement