గోకర్ణపురం గ్రామంలో కర్తల చిరంజీవులు కుటుంబం
ఉన్నది 20 సెంట్ల భూమి. కౌలుకు మరో ఎకరం దేవదాయ శాఖ భూమి. అదే ఆ కుటుంబానికి ఆధారం. సమయానికి విత్తుకుంటే సరేసరి... లేదంటే అంతేమరి. ప్రకృతి సహకరిస్తే నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేది. లేదంటే అప్పులకోసం తప్పని తిప్పలు. తరువాత వాటిని తీర్చడానికి నానా అగచాట్లు. చినుకు రాలకుంటే ఆవేదన... అతిగా వానపడితే ఆందోళన. అదనుకు విత్తనం దొరక్కున్నా... అవసరం మేరకు ఎరువులు లభించకపోయినా... ఆ ఏడాదంతా బతుకు దినదిన గండమే. ఇదీ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గోకర్ణపురానికి చెందిన కర్తల చిరంజీవులు కుటుంబ పరిస్థితి. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు. తోడబుట్టిన చెల్లెలు వారితోనే. కుటుంబమంతా కష్టపడితేనే కడుపునిండేది. లేకుంటే పస్తులే గతి. అలాంటి కుటుంబానికి ప్రభుత్వాల సాయం ఎంతో అవసరం. –కంచిలి
2019లో రాష్ట్రంలో వెఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థి కంగా నిలదొక్కుకుంది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సాయం అందింది. వ్యవసాయం పండగైంది. అవసరమైన పెట్టుబడి అదనుకు ముందే అందుతోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. సొసైటీ గోదాముల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంటి ముంగిటకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అవి వచ్చిచేరుతున్నాయి. పండించిన పంటకు ఈ క్రాప్‌లో నమోదు కావడంతో మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
ప్రకృతి పగబట్టి పంటను తినేస్తే నష్టపరిహారం సొమ్ము ఆ సీజన్ ముగియక ముందే అందుతోంది. ఇంటి ఇల్లాలు రత్నానికి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కింద ఏటా నగదు ఖాతాలో పడుతోంది. సోదరి రుక్మిణమ్మకు ఒంటరి మహిళ పింఛన్ వస్తోంది. గడచిన నెలలో వివాహమైన పెద్దకొడుకు మాధవరావుకు కల్యాణ మస్తు పథకం కింద రూ. 50వేలు అందింది. చిన్నకొడుకు జోగారావు కిడ్నీలో రాళ్లు చేరితే డాక్టర్లు రూ. 50వేలు ఖర్చవుతుందన్నారు. పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దానిని ప్రభుత్వ సాయంతో ఎదుర్కోగలమన్న నమ్మకం ఏర్పడింది. బతుకుపై భరోసా దక్కింది.
ఆర్థిక సమస్యలు తీరాయి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే మా ఆర్ధిక సమస్యలు తీరాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క నయాపైసా సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చులు మొదలుకొని, కుటుంబ అవసరాలకు సైతం ఇబ్బంది పడేవాళ్లం. చిన్నపాటి అవసరానికీ అప్పులు చేయాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల ఇంచుమించు ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతంగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో నాలుగు లక్షలకు పైబడి లబ్ధి చేకూరింది. – కర్తల చిరంజీవులు
Comments
Please login to add a commentAdd a comment