వలంటీర్లకు బీమా బాండ్లను అందజేస్తున్న కలెక్టర్ హరికిరణ్. చిత్రంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
రాజానగరం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ వలంటీర్లకు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కంపూడి రాజా సొంత డబ్బుతో ప్రమాద బీమా కల్పించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ రాజానగరంలో శనివారం ప్రారంభించారు. వలంటీర్లకు బీమా బాండ్లు అందజేశారు. నియోజకవర్గంలోని సీతానగరం మండలం వంగలపూడి గ్రామ వలంటీర్ కోడెల్లి నీలారాణి గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అటువంటి దుస్థితి మరో వలంటీర్ కుటుంబానికి ఎదురు కాకూడదనే ఆలోచనతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ ప్రమాద బీమా పథకానికి అంకురార్పణ చేశారు. ఈ పథకం ద్వారా సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో 1,475 మంది గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఇందుకుగాను బీమా కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియాన్ని జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ చెల్లిస్తుంది. వలంటీర్లకు మనోధైర్యాన్ని అందించడంలో ఈ ప్రమాద బీమా పథకం అత్యుత్తమంగా నిలుస్తుందని కలెక్టర్ కొనియాడారు. పథకం ద్వారా ప్రమాదవశాత్తు్త మరణించినా లేదా అంగవైకల్యం ఏర్పడినా వలంటీర్లకు రూ.లక్ష పరిహారం అందుతుంది. అవయవాన్ని కోల్పోతే రూ.50 వేల పరిహారం ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment