సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకీరామిరెడ్డి మరోసారి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి ఉప్పుటూరు వేణుగోపాలరావుపై 20 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రతి రౌండ్‌లో నువ్వా, నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు విజయం జానకీరామిరెడ్డిని వరించింది. మొత్తం 1,438 ఓట్లు పోల్ కాగా.. జానకీరామిరెడ్డికి 703, వేణుగోపాలరావుకు 683, మరో అభ్యర్థి డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబుకు 38 ఓట్లు వచ్చాయి. కొన్ని ఓట్లు చెల్లలేదు.
వేణుగోపాలరావు విజయావకాశాలను ప్రసాద్‌బాబు ప్రభావితం చేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి గెలుపొందడం ఇది వరుసగా రెండోసారి. ఇప్పటి వరకు సంఘం చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి ఎవరూ లేరు. కాగా ఉపాధ్యక్షుడిగా పీఎస్‌పీ సురేష్‌కుమార్ గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి తుహిన్ కుమార్‌పై 52 ఓట్ల తేడాతో గెలిచారు. సురేష్‌కు 739 ఓట్లు రాగా తుహిన్‌కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్ ఎన్నికయ్యారు. ఆయన టి.సింగయ్య గౌడ్‌పై 142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంయుక్త కార్యదర్శిగా సాల్మన్ రాజు గెలుపొందారు. ఆయన వై.సోమరాజుపై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి 75 ఓట్లతో, గ్రంథాలయ కార్యదర్శిగా జ్ఞానేశ్వరరావు 4 ఓట్లతో, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా చంద్రశేఖర్‌రెడ్డి పితాని 213 ఓట్లతో గెలిచారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అన్నం శ్రీధర్, మారుతి విద్యాసాగర్, కాశీ అన్నపూర్ణ, షేక్ ఆసిఫ్, శాంతికిరణ్, శరత్, అచ్యుతరామయ్య విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా విజయ్‌కుమార్ వ్యవహరించారు. ఎన్నికల్లో జానకీరామిరెడ్డి వర్గం ఓవైపు నిలవగా, ఆయన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు ఏకమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment