పారదర్శకంగా నంది నాటకోత్సవాలు  | Jury members have the final say in the selection of plays | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా నంది నాటకోత్సవాలు 

Published Wed, Sep 20 2023 4:20 AM | Last Updated on Wed, Sep 20 2023 4:33 AM

Jury members have the final say in the selection of plays - Sakshi

సాక్షి, అమరావతి: నంది నాటకోత్సవాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, అవార్డుల ఎంపికలో ఎలాంటి సిఫార్సులకు తావు లేదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఏపీ ఎఫ్‌డీసీ) చైర్మన్‌ పోసాని కృష్ణ మురళి అన్నారు. 22వ నంది నాటకోత్సవం–2022 ప్రాథమిక స్థాయిలో ఎంపికైన నాటకాల వివరాలను మంగళవారం జ్యూరీ సభ్యులతో కలిసి పోసాని వెల్లడించారు. విజయవాడలోని ఆర్టీసీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ నాటకాల ఎంపికలో జ్యూరీ సభ్యులదే తుది నిర్ణయమని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నాటక ప్రదర్శనలు తిలకించి పోటీలకు అర్హమైన ప్రదర్శనలను ఎంపిక చేశారన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అస్మదీయులకే పెద్దపీట వేయడం, అవకతవకలకు జరిగాయని, దాంతో నాటి సీఎం చంద్రబాబు నంది అవార్డులను రద్దు చేశారని గుర్తు చేశారు. ఈసారి అలాంటి తప్పులకు తావు లేకుండా జ్యూరీ సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, అన్ని విధాలుగా అర్హత ఉన్న నాటకాలను ఎంపిక చేసి సీల్డ్‌ కవర్‌లో మీడియా ముందు జ్యూరీ సభ్యులే వెల్లడిస్తారన్నారు. నంది నాటకోత్సవాలకు ఎంట్రీలు పంపిన వారి సౌలభ్యం కోసం వారున్న ప్రాంతంలోనే ప్రదర్శనలు నిర్వహించారని, జ్యూరీ సభ్యులే అక్కడికి వెళ్లి ప్రదర్శనలను తిలకించి తుది నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

పద్య, సాంఘిక నాటక, సాంఘిక నాటిక, బాలల నాటిక, కళాశాల/విశ్వవిద్యాలయ మొత్తం (5 విభాగాలు) విభాగంలో 115 ఎంట్రీలు రాగా, వాటిలో 38 నాటకాలను ఫైనల్‌ పోటీలకు ఎంపిక చేసినట్టు వివరించారు. జ్యూరీ సభ్యులుగా ఆయా రంగాల్లో విశేష అనుభవం గల ముగ్గురు చొప్పున మూడు కమిటీలను నియమించామన్నారు. ఫైనల్‌ పోటీల్లో ప్రదర్శనలు తిలకించే జ్యూరీని త్వరలోనే ప్రకటిస్తామని పోసాని తెలిపారు.

ఏపీ ఎఫ్‌డీసీ ఎండీ, సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తుది పోటీలకు ఎంపికైన 38 ప్రదర్శనలు నవంబర్‌ మొదటి వారంలో జ్యూరీ ముందు ప్రదర్శించి అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. వివిధ విభాగాల్లో మొత్తం 73 అవార్డులు ప్రదానం చేయడంతోపాటు, అవార్డు కింద అందించే పారితోషికం మొత్తాన్ని కూడా పెంచినట్టు చెప్పారు. పద్య నాటకానికి రూ.50 వేలు, సాంఘిక నాటకానికి రూ.40 వేలు, సాంఘిక నాటికకు, బాలల నాటికల విభాగం, కళాశాల/విశ్వవిద్యాలయ విభాగంలో ఎంపికైన నాటకాలకు రూ.25 వేలు బహుమతిగా అందించనున్నట్టు పేర్కొన్నారు.  

పద్యనాటక విభాగంలో.. 
కర్నూలు లలిత కళాసమితి ‘శ్రీ కృష్ణ కమల పాలిక’, కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం వారి ‘ఆనంద నిలయం’, హైదరాబాద్‌ శ్రీ కళానికేతన్‌ వారి ‘వసంత రాజీయం’, హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన నవక్రాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ ‘నర్తనశాల’, ప్రొద్దుటూరు సవేరా ఆర్ట్స్‌ వారి ‘శ్రీరామ పాదుకలు’, తెనాలి దుర్గా భవాని నాట్యమండలి ‘శ్రీరామ భక్త తులసీదాసు’, విజయవాడ సంస్కార భారతి ‘శ్రీమాధవ వర్మ’, కాకినాడ శ్రీసీతారామాంజనేయ నాట్యమండలి ‘సీతాకల్యాణం’, రాజాం కళాసాగర్‌ నాటక సంక్షేమ సంఘం ‘శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం (భక్తకవి నక్కీర)’, విశాఖపట్నం జయకళానికేతన్‌ ‘శ్రీకాంత కృష్ణమాచార్య’. 

నంది నాటకోత్సవాల ఫైనల్స్‌కు ఎంపికైన ప్రదర్శనలు ఇవే..  
సాంఘిక నాటికల విభాగంలో.. 
ప్రకాశం జిల్లా కొప్పోలుకు చెందిన పంట క్రియేషన్స్‌ వారి ‘పక్కింటి మొగుడు’, కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్‌ ‘గమ్యస్థానాల వైపు’, పెదకాకాని గంగోత్రి ‘అస్థికలు’, అభినయ ఆర్ట్స్‌ ‘అతీతం’, శ్రీ సద్గురు కళానిలయం ‘కమనీయం’, పొన్నూరుకు చెందిన రసఝురి ‘త్రిజుడు’, అమృతలహరి థియేటర్‌ ఆర్ట్స్‌ ‘నాన్నా నేనొచ్చేస్తా’, తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్‌ ‘జరుగుతున్న కథ’, కరీంనగర్‌ చైతన్య కళాభారతి వారి ‘చీకటి పువ్వు’, విజయవాడ యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్స్‌ ‘రాతిలో తేమ’, శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన శర్వాణి గ్రామీణ్, గిరిజన సాంస్కృతిక సేవా సంఘం ‘కొత్త పరిమళం’, విశాఖపట్నం తెలుగు కళాసమితి వారి ‘నిశబ్దమా నీ ఖరీదెంత?’.  

సాంఘిక నాటకం విభాగంలో.. 
తెనాలి కళల కాణాచి వారి ‘ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ భాజే’, విజయవాడ డాక్టర్‌ రామన్‌ ఫౌండేషన్, శ్రీ సాయిబాబా నాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో ‘విజ్ఞాన భారతం’, గుంటూరు అభినయ ఆర్ట్స్‌ ‘ఇంద్రప్రస్థం’, హైదరాబాద్‌ శ్రీ కళానికేతన్‌ ‘ఎర్ర కలువ’, హైదరాబాద్‌ మిత్రా క్రియేషన్స్‌ ‘ద ఇంపోస్టర్స్‌’, హైదరాబాద్‌ విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ ‘కలనేత’.  

బాలల నాటికల విభాగంలో.. 
అనంతపురం అరభి యూత్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వారి ‘బాధ్యత’, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం కథనం క్రియేషన్స్‌ అండ్‌ డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ ‘తథా బాల్యం’, విజయవాడ యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ ‘మూడు ప్రశ్నలు’, న్యూస్టార్‌ మోడరన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ‘ప్రపంచ తంత్రం’, శ్రీరామ్‌ ఇంగ్లిష్‌ మీడియం హైసూ్కల్‌ ‘మంచి గుణపాఠం’.   

కళాశాల/ విశ్వవిద్యాలయ నాటికల విభాగంలో.. 
విజయవాడకు చెందిన న్యూ స్టార్‌ మోడరన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారి ‘కపిరాజు’, ఎస్‌డీఎన్‌ సిద్ధార్థ మహిళా కళాశాల ‘ఇంకానా’, తెనాలి ప్రఖ్య చిల్డ్రన్స్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ అండ్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ ‘మహాభినిష్క్రమణ’, తిరుపతి నందనం అకాడమీ ‘ఉద్ధంసింగ్‌’, అనంతపురానికి చెందిన ఎస్‌ఎస్బీఎన్‌ డిగ్రీ కళాశాల వారి ‘ఇంకెన్నాళ్లు’ నాటికలు తుది పోటీలకు ఎంపికయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement