వేడుకగా శ్రీవారికి స్వర్ణ కవచ సమర్పణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామి బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకంవరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు.
ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తం గా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామికి, దేవేరులకు శతకలశ తిరుమంజనం జరిపారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, జేఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు.
నేడు పౌర్ణమి గరుడసేవ: తిరుమలలో పౌర్ణమి సందర్భంగా శనివారం గరుడ సేవ జరుగనుంది. రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment