అన్నదాత.. ఆమాత్యుడయ్యాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి పదవి వరించింది. హైదరాబాద్‌లో వివిధ రకాల వ్యాపారాలు చేసి ఉన్నత స్థితికి వచ్చినా ఆయన మూలాలు మాత్రం వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయి. తల్లిదండ్రులు కాకాణి రమణారెడ్డి, లక్ష్మీకాంతమ్మ స్థానిక ప్రజాప్రతినిధులుగా కొనసాగినా వ్యవసాయమే వారి జీవనాధారం. మంత్రి కాకాణి చదువుకునే రోజుల్లోనే స్వగ్రామం తోడేరులో తమ నిమ్మ తోటలో పండే కాయలను గూడూరు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేవారు. విద్యార్థి దశలోనే వ్యవసాయం, మార్కెటింగ్ రంగాలపై అవగాహన పొందిన ఆయన వ్యవసాయశాఖ పగ్గాలు చేపట్టనున్నారు.
సాక్షి, నెల్లూరు: ధాన్యాగారంగా నెల్లూరు ప్రసిద్ధి. పచ్చని పంట పొలాలు, పంటలతో అన్నపూర్ణగా విరాజిల్లుతున్న జిల్లాకు వ్యవసాయ శాఖ దక్కడం గొప్ప పరిణామం. రైతు బిడ్డగానే కాక ఎమ్మెల్యేగా వ్యవసాయం, రైతుల కష్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన వ్యక్తి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా సోమవారం కొలువు దీరండంతో జిల్లా కర్షక వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం తోడేరు గ్రామ రైతు బిడ్డగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనతి కాలంలోని రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక నేతగా ఎదిగి మంత్రి స్థానంలో కొలువు దీరాడు. ఆయన కుటుంబం వ్యవసాయ నేపథ్యం కావడంతో వ్యవసాయరంగ స్థితిగతులపై అవగాహన ఉంది. ప్రతి జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా రైతు పక్షాన తన గళం విప్పి వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేశారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటం
వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వ్యవసాయశాఖపైనే అధికంగా పోరాటాలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు, రైతులను గాలికి వదిలేసి రుణమాఫీ హామీని విస్మరించింది. దీంతో ఎమ్మెల్యేగా కాకాణి సుదీర్ఘకాలం టీడీపీ విధానాలపై పోరాడారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కాకాణి తన గళాన్ని వినిపించడంతో పాటు వ్యవసాయశాఖలో నెలకొన్న అవినీతిని బయట పెట్టారు. రైతురథం, ధాన్యం కొనుగోలు పథకాల్లో గోల్‌మాల్ జరిగినట్లు కాకాణి పెద్ద ఎత్తున ఉద్యమమే చేశారు. అయితే అదే శాఖకు ఇప్పుడు కాకాణి మంత్రి కావడం విశేషం. రైతుల కోసం ఉద్యమించిన మంత్రి వారి అభివృద్ధికి పాటు పడతారడంలో ఎలాంటి సందేహం లేదనే అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ కష్ట కాలంలో సర్వేపల్లి ప్రజలను ఆదుకునేందుకు ఎమ్మెల్యేగా కాకాణి పడని కష్టం లేదు. రైతుల నుంచి ధాన్యం సేకరించి బియ్యం, వంట సామగ్రిని పంచి పెట్టారు.
జిల్లాకు వ్యవసాయం కీలక శాఖ
జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కీలక శాఖ దక్కింది. జిల్లాలో సోమశిల, కండలేరు రెండు ప్రధాన జలనిధులు ఉన్నాయి. ఆ జలాశయాల కింద ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నాయి. వరి ధాన్యం విస్తారంగా పండుతోంది. ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి ప్రకృతి కరుణించింది. వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలు అందిస్తోంది. రాయితీపై యంత్రాలు పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడులకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుంది.
వ్యవసాయ పరంగా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్న నెల్లూరు జిల్లాకు వ్యవసాయ శాఖ మంత్రి దక్కడం జిల్లా వ్యవసాయ ప్రగతికి ఇదో మంచి అవకాశం. జిల్లాలో పండే ధాన్యానికి ఆర్‌బీకే కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తూ రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చేస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చేయడం, మిల్లర్లకు ముకుతాడు వేసేలా నిర్ణయాలు తీసుకోవడం , జిల్లా అధికార యంత్రాంగాన్ని రైతు సమస్యలపై అప్రమత్తం చేస్తూ సరైన మార్గదర్శకం చేస్తూ వారికి న్యాయం చేయడంలో ముందంజలో ఉంటారు. ఇక ఆ శాఖ మంత్రిగా రైతులకు మరింత న్యాయం జరిగేలా చేస్తారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ రంగంపై అవగాహన
వ్యవసాయ రంగంపై మంత్రి కాకాణికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఆ శాఖ మంత్రిగా ఆయన పలు సంస్కరణలతో పాటు, రైతుల అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం రైతులకు ఉంది. మెట్ట ప్రాంత రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన రైతుల కష్ట నష్టాలు, వారికి ఎలాంటి రాయితీలు అందజేస్తే ఉపయోగంగా ఉంటుందో అవగాహన ఉంది. వరుసగా మూడు పర్యాయాలు నియోజకవర్గంలో వాటర్ మేనేజ్‌మెంట్‌ను సమర్ధవంతంగా నిర్వహించి పంటలు పండించారు. ఎక్కడ ఎప్పుడు రైతులకు ఏ అవసరం వచ్చినా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి సమస్యను పరిష్కరించారు. ఉద్యాన పంటలు అధికంగా ఈ ప్రాంతంలో పండ్ల తోటల అభివృద్ధి, పండిన పంటల ఎగుమతిని అభివృద్ధి పరుస్తారని రైతులు ఆశిస్తున్నారు.
పరుగులు పెట్టిస్తారు
వ్యవసాయ మంత్రిగా ఆ శాఖను అభివృద్ధి పథంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరుగులు పెట్టిస్తారు. మా గ్రామానికి చెందిన కాకాణి మంత్రి కావడం గ్రామానికే గర్వకారణం. రైతులకు సేవ చేసుకునే భాగ్యం లభించినట్టుగా మేము భావిస్తున్నాం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు పూర్తి అవగాహన ఉంది.
– ఏనుగు శశిధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, తోడేరు.
యార్డుకు మంచి రోజులు
జిల్లాలో అతిపెద్ద నిమ్మ మార్కెట్ యార్డు పొదలకూరులో ఉంది. వ్యవసాయంతో పాటు మార్కెటింగ్ శాఖను మంత్రి కాకాణికి కేటాయించడం సంతోషం ఉంది. నిమ్మ యార్డు ఆయన హయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. యార్డులో సౌకర్యాల కల్పనలో ఆయన చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం వ్యాపార వర్గాలు, రైతుల్లో ఉంది.
– ఎం.బాలకృష్ణారెడ్డి, వ్యాపారి, నిమ్మమార్కెట్ యార్డు.
సంప్రదాయ రైతుగా నాగలి పట్టిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి (ఫైల్)
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో కరచాలనం
Comments
Please login to add a commentAdd a comment