కొద్ది రోజుల క్రితం వరకు యెల్లో మీడియా ఏమని ప్రచారం చేసిందో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లారని. ఇప్పుడు ఏమి రాస్తున్నారో చూడండి. కర్నాటకకు చెందిన ఒక స్వామీజీని ఆశ్రయించారని, ఆయన్ని పిలిపించుకుని మంతనాలు జరిపారని. వీటిలో ఏది వాస్తవం? దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది?..
ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రమే కాదు.. ఈనాడు, ఆంద్రజ్యోతి , టీవీ5.. తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. వాళ్లు రాసేవన్నీ అబద్దాలేనని ఈ వార్తలే రుజువు చేస్తున్నాయి. పైగా ఆ స్వామీజీ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వంటివారు తిరుమలకు వచ్చినప్పుడు వాళ్ల పక్కనే ఉంటారని , ఆయన లాబీయిస్టు అని టీడీపీ కోసం బట్టలు ఊడదీసుకుని తిరిగే ఓ పత్రిక ప్రకటించేసింది కూడా. రాష్ట్రపతికి , అలాగే న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నవారికి కూడా ఉద్దేశాలు ఆపాదించడానికి కూడా వీళ్లు బరితెగిస్తారు. అదే వైఎస్సార్‌సీపీ వాళ్లు ఎవరినైనా ఏమైనా అంటే చాలు.. ఇంకేముంది నానా యాగీ చేస్తారు. మరి ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్‌ను ఉద్దేశించే ఇంత దారుణంగా రాశారంటే వారిది ఎంత తెంపరితనం అనుకోవాలి!. పైగా తిరుమలలో స్వామీజికి ఎవరో సహకరించకపోతే అలా వారి పక్కన ఉండగలుగుతారా అని పిచ్చి ప్రశ్న ఒకటి.
రాష్ట్రపతిగాని, అత్యున్నత స్థానంలో ఉన్నవారెవరైనా, తాము ఎవరిని వెంటబెట్టుకుని వెళ్లదలిస్తే వారి జాబితాను పంపితే సరిపోతుంది. అంతే తప్ప తిరుమలలోనో, ప్రభుత్వంలోనో ఉన్నవారు పంపితే వారు అనుమతిస్తారా?. ఈ మాత్రం విజ్ఞత లేకుండా చేతిలో పేపర్ ,టీవీ ఉన్నాయని నానా చెత్త అంతా రాస్తున్నారు. దీనివల్ల వారికే నష్టం జరుగుతోంది. పొరపాటున టీడీపీ అనుకూల మీడియా నిజం రాసినా.. ఎవరూ నమ్మని పరిస్థితిని తెచ్చుకున్నారు. దీనిని గమనించే ముఖ్యమంత్రి జగన్ ఈ పత్రికలను దుష్టచతుష్టయంలో భాగం చేశారు. ఆయన అలా గట్టిగా ఎదిరించి ఉండకపోతే, వీరు రాసే అబద్దాలన్నిటినీ నిజాలని ప్రజలు భ్రమించవలసి వచ్చేదేమో!.
👉 గతంలో తమకు నచ్చని రాజకీయ పార్టీలను ఇలాగే భ్రష్టుపట్టించేవారు. వాటిని ఎదుర్కోలేక అవి నానా తంటాలు పడుతుండేవి. ఇప్పుడు జగన్‌కు ఆ ఇబ్బంది లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి వాటిని ఆయన శత్రుకూటమిలో భాగమనే ప్రజలకు గట్టిగానే చెప్పేశారు. కొంతకాలం క్రితం న్యాయమూర్తుల ఫోన్‌లను ప్రభుత్వం టాప్ చేస్తోందని ఒక తప్పుడు కధనాన్ని ప్రచారం చేశారు. దానిపై హైకోర్టు కూడా కొంత స్పందించింది. కానీ, ఆ తర్వాత ఆ పత్రిక అవాస్తవాలు రాసిందని అర్ధం చేసుకుని, ఆ గొడవను పక్కనపెట్టేసినట్లనిపిస్తుంది. ఇలా ఒకటి కాదు. ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఎంత వీలైతే అంత అగాధం సృష్టించడానికి ఈ టీడీపీ మీడియా చేయని విష ప్రయత్నం లేదంటే ఆశ్చర్యం కాదు.
👉 దీనికి తోడు అప్పట్లో ఉన్న ఒకరిద్దరు గౌరవ న్యాయమూర్తులు ఏ కారణం వల్లనన్నా కాని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంచెం వ్యాఖ్యానం చేసేవారన్న అభిప్రాయం ఉండేది. ఆ వ్యాఖ్యల్ని ఈ టీడీపీ మీడియా పతాక శీర్షికలలో ప్రచురించడమే కాదు.. ఏదో జరిగిపోతోందన్న భావన కలిగించే యత్నం చేసేది. అలాగే ఇప్పుడు ఏకంగా న్యాయ వ్యవస్థను అప్రతిష్టపాలు చేసేలా ఈ కధనాలు రాశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ కోరిక మేరకు సాయం చేయబోతున్నారని రాసింది వీరే. ఇప్పుడు ఎవరో స్వామీజీ ద్వారా లాబీయింగ్ చేస్తున్నారని రాసింది వీరే. తీరా చూస్తే ఆ లాబియిస్టుగా వీరు చెప్పిన విజయకుమార్ స్వామీజీ వెంట ఉన్న పారిశ్రామికవేత్త చింతా శశిధర్ ఈనాడు అధినేత రామోజీరావు సమీప బంధువని తేలింది. కానీ, ఆయన ఫలానా అని రాయకుండా యెల్లో మీడియా జాగ్రత్తపడింది. కేవలం పారిశ్రామికవేత్త అని రాసి సరిపెట్టింది.
👉 చింతా శశిధర్ అనే ఈ పారిశ్రామికవేత్త నవయుగ కంపెనీ అధినేత విశ్వేశ్వరరావు కుమారుడు. విశ్వేశ్వరరావుకు ఈ కథనాన్ని వండిన మీడియా అధినేతకు మధ్య ఆర్దిక సంబంధాలు కూడా ఉండేవి. అందుకేనేమో టిటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పిన విషయాలలో కొన్నింటిని ఎడిట్ చేసి.. ఆయన ప్రస్తావన రాకుండా వార్త ఇచ్చారు. ఇక్కడ మరో సంగతి కూడా చెప్పాలి. లాబీయిష్టు అంటూ కథనాలు ఇచ్చిన పత్రికాధిపతి కూడా లాబియిస్టే.
👉 గతంలో ఆయా రాజకీయ పార్టీలు బ్రోకర్ అని కూడా ఆయన్ని విమర్శించేవి. దానికి కారణం ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్న టైమ్ లో సచివాలయంలో పైరవీలలో చక్రం తిప్పేవారని అంటారు. అలాగే గత టరమ్ లో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు లావాదేవీలలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారని చెబుతారు. మరి అలా చేసిన వ్యక్తిని లాబియిస్టు అంటారా? రాజకీయ బ్రోకర్ అంటారా?. ఎదుటివారిని అనడం కాదు.. తాము ఎలా ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోకూడదు. నీతులు చెప్పేస్తే జనం అంతా చెవిలో పూలు పెట్టుకుని వింటారన్నది కొందరి నమ్మకం.
👉 విజయకుమార్ స్వామీజీ గతంలో రామోజీకి సంబందించిన ఒక ఫంక్షన్ కు కూడా హాజరై ఆశీర్వదించారట. వైవి సుబ్బారెడ్డి చాలా స్పష్టంగా విజయకుమార్ స్వామీజి తమకు తెలుసునని, ఆయనను సీఎంగారికి ఆశీర్వచనం ఇప్పించడానికి ఆహ్వానించామని వెల్లడించారు. ‘‘రామోజీ సమీప బంధువు ఆయన్ని వెంటబెట్టుకు వచ్చారు. కాబట్టి మార్గదర్శి కేసు నుంచి బయట పడేయించడానికే తీసుకు వచ్చారని అనవచ్చా?’ అని వైవీ సుబ్బారెడ్డి ముక్కుసూటిగా ప్రశ్నించారు. ఒక పక్క సీబీఐ తన మానాన తాను ఏకపక్షంగా విచారణ సాగిస్తూ, వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేసి, ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలా అరెస్టు చేయాలా? అనే ఆలోచన చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోపక్క ఈ టీడీపీ మీడియా ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాసి ముఖ్యమంత్రి జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. చివరికి తానే వివేకాను హత్య చేశానని చెప్పిన వ్యక్తితో మాట్లాడి పేజీలకొద్ది వార్తలు ఇచ్చే దుస్థితికి ఈనాడు వచ్చింది. హత్య చేసిన తర్వాత ముందస్తు బెయిల్ పొంది, అప్రూవర్ గా మారి బయట తిరిగి ఎవరో ఒకరిపై ఆరోపణలు చేస్తూ.. మీడియాతో మాట్లాడే సదుపాయం ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి.
👉 ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. నటుడు , టీడీపీ నేత బాలకృష్ణ తన ఇంటిలో కాల్పులు జరిపినప్పుడు ఆయన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి, బావ వెంకటేశ్వరావులు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి సాయం చేయాలని కోరారని చెబుతారు. మరి వారిని లాబియిస్టులుగా ఆనాడు ఈ మీడియా ఎందుకు రాయలేదు?. వివేకా కేసులో అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని కోరుతున్నవారిని ఎలాగోలా బద్నాం చేయాలని వీరు తంటాలు పడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టడానికి సీబీఐని వాడుకున్నట్లు.. ఇప్పుడు అవినాష్‌రెడ్డిని కూడా ఇరుకున పెట్టాలని టీడీపీ, ఆ పార్టీ మీడియా విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. అవినాష్‌కు హైకోర్టులో వారం రోజులపాటు అరెస్టు కాకుండా ఊరట లభించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనలలో వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించి షేడీ వ్యవహారం వెలుగులోకి రావడం ఆయనకు అప్రతిష్ట తెచ్చింది. దీనికి ఆయన కుమార్తె, అల్లుడు కారణం అవుతున్నారా!. పైగా వివేకా కుమార్తె తండ్రి హత్య జరిగినప్పుడు మాట్లాడిన విషయానికి, ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకు ఎంత తేడా ఉంది! మరి దీనికి కారణం ఏమిటో!.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment