ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు కొన్ని లెక్కలు చెబుతుండేవారు. జర్నలిస్టులతో ఆయన సమావేశం అయినప్పుడు తన పత్రికలో ప్రతి సెంటీమీటర్ ఎంత విలువైనదో వివరించేవారు. అదెలాగంటే ఎవరిదైనా అనవసరమైన ప్రకటన వేసినట్లు భావించినా, ఆయనకు నచ్చని వార్తను ప్రచురించినా, దానికి ఆయన లెక్క. కట్టేవారు. సెంటిమీటర్ విలువ ఇన్నివందల రూపాయలు అని, మొత్తం ఎన్ని సెంటీమీటర్లు ఆ వార్త నిడివి ఉంటే దానిని బట్టి హెచ్చించి ఇన్నివేల రూపాయల నష్టం జరిగిందని చెప్పేవారు.
మొదట అర్ధం అయ్యేది కాదు. అడ్వర్టైజ్‌మెంట్ వేసిన తర్వాత మిగిలిన స్పేస్ లోనే కదా వార్తలు వస్తున్నదని జర్నలిస్టులు అనుకునేవారు. ఆయన ఆలోచన భిన్నంగా ఉండేది. అంత వార్త బదులు ప్రచార ప్రకటన (యాడ్) వేసి ఉంటే ఇంత డబ్బు వచ్చేది కదా అన్నది ఆయన భావన. అంటే.. తన పత్రికలోని స్పేస్ అంత విలువైనది అని ఆయన అనేవారు.
ఆ లెక్కన చూస్తే ఇప్పుడు ఈనాడులో నిత్యం మార్గదర్శి అక్రమాలను సమర్ధిస్తూ కొందరు తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతర నేతలు, రామోజీరావు మద్దతుదారులు, చేస్తున్న ప్రకటనలను ఒక పేజీలో సగంపైగా వేస్తున్నారు. అవసరమైతే ఇంకా అదనంగా కూడా ఇస్తున్నారు. దీని ప్రకారం ఎన్ని కోట్ల రూపాయల విలువైన స్పేస్ ను మార్గదర్శి కోసం వాడుకున్నట్లో అంచనా వేయండి.
మరేదైనా ప్రైవేటు సంస్థపై ఇలాంటి కేసులు వస్తే ఎవరైనా ఖండన ఇస్తే ఈ స్థాయిలో వార్తలు ఇచ్చేవారా? పైగా ఆ సంస్థ వాదనతో నిమిత్తం లేకుండా ఇదే ఈనాడు మీడియా ఎన్ని కథలు, కధనాలు వండి వార్చేది. జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి పెట్టిన కేసులలో సీబీఐ చేసిన విచారణపై ఎన్ని వేల పేజీల వార్తలు ముద్రించి ఉంటుంది. సాక్షి పత్రికను ఎన్ని రకాలుగా అప్రతిష్టపాలు చేయడానికి యత్నించింది వారికి గుర్తుకు లేదా? మాట్లాడితే జగన్ ను తీహారు జైలుకు పంపుతారు అంటూ తప్పుడు కధనాలు రాశారే.
మార్గదర్శికి మద్దతు గా చేస్తున్న ప్రకటనలలో ఎవరైనా రామోజీరావు ఫలానా తప్పు చేయలేదని నిర్దిష్టంగా చెబుతున్నారా? అంటే.. అదేమీ కనిపించదు. రొడ్డకొట్టుడు స్టేట్ మెంట్స్ తప్ప. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీ రాస్తున్నారు కనుక మార్గదర్శిపై కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. 1982 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చిట్ ఫండ్ చట్టం వచ్చింది. ఆ చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకే రామోజీరావు, ఆయన కోడలు శైలజ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లపై కేసులు పెట్టారు. అవి వాస్తవమైనవి కాకపోతే ఫలానా రకంగా అవి అక్రమ కేసులు అని చెప్పవచ్చు. వీరెవ్వరూ అలా అనడం లేదు.
కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తెలుగుదేశం నేతలతో పోటీ పడి మార్గదర్శి కేసులో రామోజీకి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. దానికి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలివితక్కువగా చిట్ పండ్ నియంత్రణ చట్టం తెచ్చిందని చెబితే బాగుంటుంది కదా!. రామోజీరావు చేతిలో ఒక పెద్ద పత్రిక ఉంది కనుక, అందులో తమకు ఉచిత ప్రచారం కావాలని అనుకునేవారు ఇలా మద్దతు ప్రకటనలు చేస్తున్నారని అనుకుంటే తప్పేముంటుంది? చంద్రబాబు నేరుగా మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదు. కాని మిగిలిన టిడిపి నేతల ద్వారా పోటీ పడి రామోజీని భుజాన వేసుకుని మోయిస్తున్నారు. అలా చేయకుంటే రామోజీరావుకు తమపై ఎక్కడ కోపం వస్తుందోనన్నది వారి భయం కావచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన సంగతి చెప్పుకోవాలి.
చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్న 1999 లోనే డిపాజిట్‌దారుల రక్షణ చట్టం వచ్చింది. దాని ప్రకారమే ఇప్పుడు రామోజీ చేసిన ఉల్లంఘనలపై కేసు పెడుతుంటే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. దానికి ముందుగా.. రామోజీ తాము తీసుకు వచ్చిన చట్టం ప్రకారం తప్పు చేయలేదని టీడీపీ వారు వివరించాలి కదా! రామోజీపై కక్షపూరితంగా కేసులు పెట్టారని అంటున్నవారు కూడా మార్గదర్శిపై కేసులు పెడితే అది ఏరకమైన కక్షో చెప్పలేకపోతున్నారు. మార్గదర్శి డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిందా? లేదా? ఏపీలో బ్రాంచ్ కార్యాలయాలలో ఉండవలసిన డబ్బును నిబంధనలకు విరుద్దంగా హైదరాబాద్ కు తరలించేవారా? కాదా? బాలెన్స్ షీట్లలో బోగస్ చెక్కులు చూపించారా?లేదా? అన్నవాటికి వీరెవరైనా జవాబు ఇస్తారేమోనని చదివితే అలాంటిదేమీ దొరకదు.
జగన్ రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సాక్షి మీడియాను స్థాపించినప్పటి నుంచి రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియా అంతా కక్ష కట్టి రాసిందని టీడీపీ, కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారా? అది కక్ష కానప్పుడు ఇప్పుడు మార్గదర్శిపై కేసులు వస్తే అవి ఎలా కక్షపూరితం అవుతాయి?. నిజానికి చంద్రబాబును ఓడించి జగన్‌నును ప్రజలు ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఈనాడు మీడియా ఎంత నీచంగా వార్తలు ఇస్తోంది. అదంతా కక్షతో కాదా?. తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనతోనే కదా రామోజీ వార్తలు ఇస్తున్నారని అనుకోవచ్చని వీరు చెబుతున్నారా?. ఒక వేళ ఈ మద్దతుదారులు చేస్తున్న ప్రకటనలకు ఆదారాలు ఉంటే వాటిని సీఐడీకి అందచేయవచ్చు కదా? ఆ రకంగా సీఐడీని ఇరుకున పెట్టవచ్చే! ఆ అవకాశాన్ని వదలుకుని ఎందుకు కేవలం ప్రచారానికే పరిమితం అవుతున్నారు?.
తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రాల లీక్ కేసులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు చేసిన ఆరోపణలపై అక్కడి దర్యాప్తు బృందం వారికి నోటీసులు ఇచ్చి విచారించింది కదా?. అప్పుడు అది కక్ష అని ఈ టీడీపీ మద్దతుదారులు ఎందుకు అనలేదు?. దీని అర్ధం ఏమిటంటే రామోజీ మీడియాలో తమకు ఉత్తి పుణ్యానికి ప్రచారం వస్తుందని వీరు వారికి కావల్సిన రీతిలో ప్రకటనలు చేస్తున్నారన్నట్లే కదా!. ఒకప్పుడు కొన్ని ఫైనాన్స్ సంస్థలు 24 శాతం ,అంతకు మించి వడ్డీ ఇస్తామని ప్రచార ప్రకటనలు ఈనాడు మొదటి పేజీలో ఇచ్చేవి. వాటిని నమ్మి ఎంతో మంది నష్టపోయారు.అలాంటి ప్రకటనలను ఈనాడు అంగీకరించవద్దని కొందరు పెద్దలు సలహా ఇచ్చినా , తన వ్యాపారం కోసం రామోజీ ఆ పనిచేయలేదు.
తదుపరి కాలంలో అలాంటి ఫైనాన్స్ సంస్థలు మూతపడి వేలాది మంది నష్టపోయారు. కృషి బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్ వంటి చిన్న బ్యాంకులు మూతపడినప్పుడు కూడా వేలాది మంది డిపాజిటర్లు చాలా మొత్తాలను వదలుకోవలసి వచ్చింది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం డిపాజిట్ల రక్షణ చట్టం తెచ్చింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ తీసుకు వచ్చిన చట్ట సవరణ 45 ఎస్ ప్రకారం కూడా హిందూ అన్ డివైడెడ్ ఫ్యామీలి సంస్థలు ఇతరుల నుంచి డిపాజిట్ లు వసూలు చేయరాదు. వీటన్నిటిని ఉల్లంఘించి డిపాజిట్లు తీసుకున్న సమాచారంతో ఆనాటి వైఎస్ ప్రభుత్వం కొంత చర్య తీసుకుంది. రాజమండ్రి ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ కేసు వేయడం, అది ఇప్పటికీ కొనసాగుతుండడం తెలిసిన సంగతే. ఈ సందర్భంగా కీలక వ్యవస్థతో సహా ఆయా వ్యవస్థలలో, రాజకీయ పార్టీలలో రామోజీకి ఉన్న పరపతిని ఉండవల్లి వివరిస్తుంటారు. తద్వారా రామోజీ ఎలా రక్షణ పొందేది చెబుతుంటారు. అయినా తాను అక్రమంగా తీసుకున్న డిపాజిట్లను ఆయన అప్పటికప్పుడు చెల్లించక తప్పలేదు.
రూ. 2,600 కోట్ల మొత్తం చెల్లించడానికిగాను ఆయన తన టీవీలను అమ్ముకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ అనుభవం ఉన్నా, మళ్లీ మరో రూపంలో రామోజీ ఇలా డిపాజిట్లు సేకరించగలిగారంటే ఎంత ధైర్యం ఉండాలి. అందుకే ప్రభుత్వాలు తన గుప్పిట్లో ఉండాలని ఆయన కోరుకుంటారన్నమాట. కాంగ్రెస్ వ్యతిరేకత మా విధానమని ఆయన చెప్పినా, ఆయా సమయాలలో కాంగ్రెస్ లోని కొందరు నేతలతో ఆయన చెట్టపట్టాలేసుకోగలరు. ఉదాహరణకు జైపాల్ రెడ్డి తదితరులు ఆయనకు ఎంత సన్నిహితులో చెప్పనవసరం లేదు. అలాగే బిజెపిలోని పెద్దల సంగతి సరేసరి. కీలక వ్యవస్థలోని ప్రముఖులు రామోజీ ఇంట్లో కార్యక్రమానికి క్యూ కట్టిన వైనం సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అయింది.
ఇవన్ని పత్రికా విలువలేనా? అసలు తప్పు చేయలేదని చెప్పలేక ఇలా డొంక తిరుగుడు పద్దతిలో పేజీల కొద్ది తమకు అనుకూల కధనాలు రాయడం ద్వారా వందల కోట్ల రూపాయల విలువైన మీడియా స్పేస్‌ను ఆయన దుర్వినియోగం చేస్తున్నారా? సద్వినియోగం చేస్తున్నారా? ఇవేనా జర్నలిజం విలువలు?.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment