
పక్కా పన్నాగంతోనే పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్ట్
2015లో నంది అవార్డును తిరస్కరించిన పోసాని
అవార్డుల కమిటీ కూర్పు నచ్చలేదని వ్యాఖ్య.. సినీ పరిశ్రమలో కులాలు లేవని స్పష్టీకరణ
2015లో చేసిన వ్యాఖ్యలపై 2025లో ఫిర్యాదు.. వెంటనే అక్రమ అరెస్టు
ఇదీ బాబు సర్కారు కక్ష సాధింపు
ఎంతోమంది ప్రముఖులు పద్మ అవార్డులను తిరస్కరించినా
వారిపై ఏనాడూ కేసు నమోదు చేయని కేంద్ర ప్రభుత్వం
అసభ్యకరంగా దుర్భాషలాడిన చరిత్ర చంద్రబాబు, పవన్, లోకేశ్, అయ్యన్న తదితరులదే
సాక్షి, అమరావతి: ‘‘కులాల వారీగా నంది అవార్డులను పంచుకున్నారు..! చంద్రబాబు హయాంలో కులాలను బట్టే పంపకాలు జరిగేవి.. అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులుంటే వారిలో 11 మంది కమ్మ కులస్తులే. నాకు వచి్చన అవార్డు కమ్మ నందిలా కనిపించింది. అందుకే అవార్డును తిరస్కరించా..!’ ఇదీ ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్య!!
ఆయన ఎప్పుడో 2015లో చేసిన వ్యాఖ్యలవి! అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైన పదాలు ఏమీ లేవు. అసలు ఆయన ఎవరినీ దూషించలేదు. నంది అవార్డులను నిర్ణయించిన కమిటీ కూర్పుపైనే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కమ్మ కులాన్ని కూడా తూలనాడలేదు.
అంతేకాదు.. పోసాని ఇంకా ఏమన్నారంటే...!
‘కమిటీలో 11 మంది కమ్మ కులస్తులు ఉండటం తప్పేమీ కాదు. 12 మంది కూడా కమ్మ కులస్తులే ఉండొచ్చు. ఇది తెలుగు సినీ పరిశ్రమ. కులాలు, మతాలకు సంబంధం లేని పరిశ్రమ. చాలామంది సినీ పరిశ్రమలో కమ్మ డామినేషన్... కాపు డామినేషన్ అని అంటారు. అదేమీ లేదు. వీడు మా కులం వాడు కాబట్టి వాడిని డెవలప్ చేద్దాం అనే మ్యాటరే లేదు...’ అని కూడా పోసాని విస్పష్టంగా చెప్పారు.
అంటే ఆయన ఎవరినీ దూషించలేదన్నది సుస్పష్టం. వాస్తవం ఏమిటంటే... పోసాని కృష్ణ మురళి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. అయినా సరే ఆయన తనకు ప్రకటించిన అవార్డును తిరస్కరించారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన హక్కు కూడా..!
ఎప్పుడో 2015లో పోసాని కృష్ణ మురళి చేసిన ఆ వ్యాఖ్యలపై తాపీగా పదేళ్ల తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం విభ్రాంతికరం. ఇది చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు తార్కాణం.. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల హననానికి నిదర్శనం...!
అవార్డుల తిరస్కరణ నేరమేమీ కాదు..
తమకు ప్రకటించిన అవార్డులను వివిధ కారణాలతో తిరస్కరించడం నేరమేమి కాదు. దేశంలో వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులను తిరస్కరించారు. వారిలో స్వాతంత్య్ర సమర యోధులు, కవులు, కళాకారులు, క్రీడాకారులు, పాత్రికేయులు... ఇలా పలువురు ఉన్నారు. ఇక గతంలో తాము తీసుకున్న పద్మ అవార్డులను సైతం తరువాత ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఎంతోమంది ప్రముఖులు త్యజించి వెనక్కి ఇచ్చేశారు.
వారిలో ప్రముఖ చరిత్ర పరిశోధకురాలు రోమిల్లా థాపర్, కవి కె.శివరామ కర్నాథ్, పారిశ్రామికవేత్త కేశుభ్ మహీంద్ర, ఆధ్యాత్మిక గురువులు పండిట్ రవిశంకర్, మహమ్మద్ బహరుద్దీన్, మాతా అమృతానందమయి తదితరులు ఉన్నారు. ఏ కారణంతో తాము అవార్డులను తిరస్కరిస్తోందీ, త్యజిస్తోందీ కూడా వారు వెల్లడించారు. అంతమాత్రాన వారిపై కేంద్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయలేదు. వారిని వేధించలేదు.
పక్కా కుట్రతో ఫిర్యాదు... ఆ వెంటనే అరెస్ట్
రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపులతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి బరితెగించింది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలపై వేధింపులకు తెగబడింది. అదే రీతిలో పోసాని కృష్ణమురళిపై కూడా రాష్ట్రవ్యాప్తంగా 16 అక్రమ కేసులు నమోదు చేసింది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని... తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించిన ఆయన హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
అయినా సరే పోసాని కృష్ణ మురళిపై టీడీపీ అంకుశం వేలాడుతూనే ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం అవసరమైనప్పుడు పోసానిని అరెస్ట్ చేయాలని ముందే పన్నాగం వేసింది. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వంపై సర్వత్రా వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడంతోపాటు... చంద్రబాబు అవమానించడంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా ఉదంతం నుంచి టీడీపీ శ్రేణుల దృష్టి మళ్లించేందుకే పోసాని అక్రమ అరెస్టు కుట్రను హఠాత్తుగా తెరపైకి తెచ్చింది.
ఈ క్రమంలో.. 2015లో పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలను తాను ఇటీవల సోషల్ మీడియాలో చూశానని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు చెందిన జోగినేని మణి ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేయడం... ఆ వెంటనే పోలీసులు పోసానిపై కేసు నమోదు చేయడం.. హైదరాబాద్‌లో బుధవారం అరెస్ట్ చేసి అర్ధరాత్రి తరలించడం... అంతా పక్కా పన్నాగంతో చక చకా పూర్తి చేసి రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపుల కుట్రకు బరి తెగించారు.
సోషల్ మీడియా పోస్టులపై బీఎన్‌ఎస్ 111 సెక్షన్లతో వ్యవస్థీకృత నేరాల కింద కేసు పెట్టకూడదన్న హైకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘించి మరీ అక్రమ కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 111 సెక్షన్‌తోపాటు 196, 353(2)తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ కుతంత్రానికి తార్కాణం.
Comments
Please login to add a commentAdd a comment