
కార్మిక నేతలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ అభ్యంతకర వ్యాఖ్యలు
పవన్‌ను కలిసే ముందు యూనియన్ నాయకులందరినీ చాచిపెట్టి కొట్టాలి
తాళి ఒకరితో కట్టించుకుని.. సంసారం మరొకరితో చేసే వెధవలు యూనియన్ నాయకులు
యూనియన్లు, పార్టీలతో అఖిలపక్షం వేస్తే తప్ప స్టీల్‌ప్లాంట్‌ను నిలబెట్టుకోలేం
విశాఖపట్నం, సాక్షి: కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయాలని చూస్తున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సోమవారం ఓ వీడియో పోస్ట్ చేశారు.
వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘స్టీల్ ప్లాంట్‌ను ఎలా అమ్మేయాలా అని చూస్తున్న వారిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది కార్మిక సంఘాల నేతలే. ఏదో ఒక యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఈ నెల 19న పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు కార్మిక సంఘాల నేతలు వెళ్తున్నారని తెలిసి ఇలా స్పందిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2021లో అమిత్‌షా వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ ఉక్కు సెంటిమెంట్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లారని, ఆ సమయానికి స్టీల్‌ప్లాంట్‌లో ఒక్క ఉద్యమం కూడా మొదలవలేదని పేర్కొన్నారు.
ప్రైవేటీకరణ ఆగిపోతే ఎక్కడ పవన్‌కు క్రెడిట్ వచ్చేస్తుందోనని ఈ నాయకులు దుకాణాలు తెరిచారని ఎద్దేవా చేశారు. ఉక్కు నిర్వాసితుల్ని పక్కనపెట్టి కార్మిక సంఘాలు పెద్ద టెంట్ పెట్టుకుని తూతూమంత్రంగా ఉద్యమాన్ని నడిపారని ఆక్షేపించారు. అక్టోబర్ 2021లో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేస్తే.. అప్పటి ప్రభుత్వానికి, విజయసాయిరెడ్డికి, బొత్సకు ఎవరికీ పట్టలేదన్నారు. పవన్ కల్యాణ్ నిరాహార దీక్షకు కార్మిక సంఘాల నేతలు ఎవరూ ముందుకురాలేదని, వీరంతా ప్రైవేటీకరణకు పూర్తిగా సహకరించిన వారేనని ఆరోపించారు.
10 ఫిబ్రవరి 2021న ప్రైవేటీకరణ ప్రకటన దశలోనే @PawanKalyan గారు డిల్లీ వెళ్లి కేంద్రంలో అధికారులను, కేంద్ర హోం మంత్రి @AmitShah గారిని కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం 32మంది ప్రాణత్యాగం వల్ల వచ్చిందని దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంటు ఉందని కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ పరిశ్రమల నుండి… pic.twitter.com/c9BCRVidbO
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) September 16, 2024
అప్పటి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఊరుకుందన్నారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, ఒత్తిడి తీసుకొస్తే అప్పుడే ఫలితం వచ్చేదన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు తామే ఇన్నాళ్లూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపినట్టు చెబుతున్నారని, వారి హయాంలోనే చాపకింద నీరులా ప్రైవేటీకరణ ప్రక్రియ అంతా జరిగిందని వ్యాఖ్యానించారు.
నాయకులందర్నీ చాచిపెట్టి కొట్టాలి
పవన్‌ను కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాలు మెడకు చుట్టి కొట్టినట్టు.. యూనియన్ నాయకులందర్నీ చాచిపెట్టి కొట్టాలంటూ బొలిశెట్టి పరుష పదజాలాన్ని వాడారు. జనసేన వెంట ఆనాడు రమ్మంటే ఎవరూ రాలేదని, తాళి కట్టించుకోవడం ఒకడితో.. సంసారం మరొకడితో అన్నట్టు కొంతమంది యూనియన్ నాయకుల్ని వెధవలంటూ ధ్వజమెత్తారు. పవన్‌తోపాటు, సీఎం చంద్రబాబును సమన్వయం చేసుకుంటూ అన్ని పార్టీలు కలిసి నిలబడితే తప్ప స్టీల్‌ప్లాంట్‌ను నిలబెట్టుకోలేమని పేర్కొన్నారు.
పవన్‌ను కలవాలని పోరాట కమిటీ నిర్ణయం
ఉక్కు నగరం: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు సోమవారం జరిగిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భేటీలో నిర్ణయించారు. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు ఉక్కు ఉద్యోగులు సగం రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కేఎస్‌ఎన్ రావు, అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, జి.గణపతిరెడ్డి, రామ్మోహన్‌కుమార్, కామేష్, వరసాల శ్రీనివాసరావు, శ్రీనివాసనాయుడు, సురేష్ పాల్గొన్నారు.