పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. ఒకపక్క ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు అవకాశాలు కల్పిస్తూనే.. మరోపక్క టిడ్కోలో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రెండేళ్ల పాటు కోవిడ్ కేర్ సెంటర్లుగా ఉపయోగించడం వల్ల వాటిని లబ్ధిదారులకు అప్పగించడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుగా ఉండడంతో వేగంగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భీమవరం(ప్రకాశం చౌక్): ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం టిడ్కో అధికారులు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో టిడ్కో ఇళ్లపై నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రిజిస్ట్రేషన్ల పనులు ముమ్మరం చేశారు. ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు.
300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితం...
నూతన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో 20,784 టిడ్కో ఇళ్లు నిర్మించారు. ఏ కేటగిరీలో 300, బీ కేటగిరీలో 365, సీ కేటగిరీలో 430 చదరపు అడుగుల ఇళ్లు నిర్మించగా, ఇవన్నీ కలిపి 20,784 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇందులో నాలుగు పట్టణాల్లో కలిపి 300 చదరపు అడుగుల ఇళ్లు 6944 నిర్మించగా, ప్రభుత్వం వీటిని లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను ఫేజ్–1లో లబ్ధిదారులకు ఈ నెల 15 నుంచి అప్పగించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.
రిజిస్ట్రేషన్లు వేగవంతం
జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లోని టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్లాట్లను లబ్ధిదారుల పేరిట ఉచిత రిజస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మెప్మా విభాగం అధికారులు ఆయా పట్టణాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లబ్ధిదారులను తీసుకువెళ్లి ప్లాట్లను రిజస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఇళ్లు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించడంతో రిజస్ట్రేషన్ ప్రక్రియ మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఉచితంగా రిజస్ట్రేషన్ చేసి ప్లాట్లు అప్పగించడంపై లబ్దిదారులు సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు ఇలా...
ఇప్పటివరకు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 3758 మందికి ప్లాట్లు రిజస్ట్రేషన్ చేశారు. అందులో భీమవరంలో 900, పాలకొల్లులో 1458, తాడేపల్లిగూడెంలో 1400 చొప్పున ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేపట్టారు. మూడు పట్టణాల్లోని ఫేజ్–1 లబ్ధిదారుల్లో 2577 మంది రూ.68.39 కోట్ల బ్యాంకు రుణాలు పొందారు.
ఫేజ్–1 కోసం ముమ్మరంగా ఏర్పాట్లు
జిల్లాలో ఫేజ్–1లో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలకు సంబంధించి 6048 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడు కేటగిరీల ఇళ్లూ ఈ ఫేజ్‌లో ఉన్నాయి.
– ఎం.స్వామినాయుడు, టిడ్కో ప్రాజెక్టు ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment