తాను నిర్మించిన వెదురు వంతెన వద్ద జయదేవ్ భొత్ర
సాక్షి, జయపురం(శ్రీకాకుళం): నిత్యావసరాల కోసం అక్కడి వారంతా నదిలో ప్రమాదకర పరిస్థితుల్లో నాటుపడవలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఈ క్రమంలో తన కళ్ల ముందు జరిగిన ఎన్నో పడవ బోల్తా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి, కలత చెందాడు. ఎలాగైనా అక్కడి వారి కష్టాలను తీర్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన కష్టార్జితంతో కొనుక్కొన్న కాస్తంత భూమిని సైతం రూ.లక్షకు అమ్మేశాడు.
దాంతో వంతెన నిర్మాణం చేపట్టి, దాదాపు 50 గ్రామాల ప్రజల రాకపోకలకు మార్గ సుగమం చేశాడు. వారి పాలిట మార్గదర్శిగా నిలిచాడు. అతడే నవరంగపూర్ జిల్లా, కొశాగుమడ సమితి, కొకొడిసెమల గ్రామపంచాయతీ, కంఠసురగుడకు చెందిన జయదేవ్ భొత్ర.
వివరాలిలా ఉన్నాయి.. నవరంగపూర్–కొరాపుట్ జిల్లాలకు చెందిన దాదాపు 50 గ్రామాల ప్రజలు నిత్యావసరాల కోసం కొరాపుట్ జిల్లాలోని కొట్‌పాడ్, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ ప్రాంతాలపై ఆధారపడుతుంటారు. వీరంతా వాటి కోసం కంఠసురగుడ వద్ద ఇంద్రావతి నది మీదుగా పడవ ప్రయాణం చేసి, తమ గమ్య స్థానాలను చేరుకుంటారు. అయితే ఇలా నది దాటే క్రమంలో జరిగిన పడవ బోల్తా ఘటనల్లో చాలామంది చనిపోయారు.
ఈ నేపథ్యంలో శాశ్వత వంతెన కోసం అక్కడి ప్రజలంతా నేతలు, అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మానవత్వంతో ముందుకు వచ్చిన ఆదివాసీ జయదేవ్ భొత్ర తనకున్న కాస్త పొలాన్ని అమ్మేసి, వెదురుకర్రలతో నదిపై తాత్కాలిక వంతెన నిర్మించాడు. 110 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ వంతెన నిర్మాణానికి 600కి పైగా వెదురు కర్రలు, మేకులు, ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ వైర్లు ఉపయోగించినట్లు జయదేవ్ తెలిపాడు.
అతడు చేపట్టిన ఈ పనిని చూసి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, శాశ్వత వంతెన నిర్మాణానికి ముందుకు వస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment