నరసరావుపేట రూరల్: షూరిటీల పేరుతో ఖాతాదారులను మార్గదర్శి చిట్స్ యాజమాన్యం వేధిస్తోందని మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్ పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో నగదు చెల్లించడం లేదన్నారు. షూరిటీలు సరిపోవనే నెపంతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు ఆ నగదులో కొంత ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఖాతాదారులపై ఒత్తిడి తీసుకువస్తారని చెప్పారు.
చట్టవ్యతిరేకంగా మార్గదర్శిలో చిట్‌లు నిర్వహిస్తున్నారని తెలిపారు. చిట్ గ్రూప్‌లోని సభ్యులందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. నెలవారీ నగదును డిపాజిట్ చేసే బ్యాంక్ వివరాలు కూడా చిట్ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మార్గదర్శి చిట్ వ్యవహరిస్తోందని తెలిపారు. సకాలంలో చిట్ నగదు చెల్లించలేదనే నెపంతో జరిమానాలు, వడ్డీలు వేస్తున్నారని తెలిపారు.
పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అధిక శాతం సభ్యులుగా మార్గదర్శి చిట్స్‌లో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 270 మంది ఖాతాదారులు మార్గదర్శి చిట్స్‌లో మోసపోయామని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈవిధంగా పల్నాడు జిల్లాలో 18 మంది ముందుకు వచ్చారని వివరించారు.
నరసరావుపేట డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్స్, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై ఖాతాదారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చిట్ నగదు చెల్లించిన ఖాతాదారుల ఆస్తులను జప్తు చేసుకునే విధంగా మార్గదర్శి యాజమాన్యానికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మార్గదర్శి చిట్స్‌లో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ
Comments
Please login to add a commentAdd a comment