అంబేడ్కర్ విగ్రహ నమూనా వద్ద మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ నడిబొడ్డున ఏప్రిల్ 14వ తేదీన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఏపీ మంత్రి, అంబేడ్కర్ విగ్రహ మంత్రుల కమిటీ చైర్మన్ మేరుగు నాగార్జున చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని నడుస్తున్నారని తెలిపారు. హరియాణలోని మానేసర్‌లో రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహ నమూనాను కమిటీ సభ్యులు, మంత్రులు ఆదిమూలపు సురేశ్, కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. విగ్రహ తయారీదారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక న్యాయానికి ప్రతీకగా అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ విగ్రహం రూపొందుతోందని తెలిపారు. అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. దళితులు, బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు.
విజయవాడలో రూ.2 వేల కోట్ల విలువైన స్థలంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బలహీనవర్గాల ఆత్మగౌరవానికి ఈ విగ్రహం ప్రతీకగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అంబేడ్కర్ విగ్రహానికి రూ.100 కోట్లు కేటాయించి అరకొర పనులు చేశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.270 కోట్లు కేటాయించడంతోపాటు అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అంబేడ్కర్‌కు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనేక పోలికలున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి నరేష్ కుమావత్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం తయారు చేసే అవకాశం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమకు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment