
ఒంగోలు(ప్రకాశం జిల్లా): మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన సోమవారం ఉదయం చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై పనుల నిమిత్తం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా దారి మళ్లింపు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
చదవండి: చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు
డివైడర్‌పై ఏర్పాటు చేసిన కోన్‌లు హోరు గాలికి ఎగిరి రోడ్డుకు అడ్డంగా పడటంతో మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో పాటు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్నాయి. మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారు కూడా అదుపు తప్పినప్పటికీ.. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే మరో కారులో ఎక్కి ఆయన వెళ్లిపోయారు. హైవే మొబైల్ సిబ్బంది, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పక్కకు తొలగించారు.