సాక్షి, విజయవాడ: కిడ్నీ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కిడ్నీ రాకెట్ వార్తలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పెందుర్తి తిరుమల ఆస్పత్రి ఘటన తమ దృష్టికి రాగానే విచారణకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వైజాగ్ కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆస్పత్రిని సీజ్ చేశారని వెల్లడించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమల ఆస్పత్రికి అసలు అనుమతులే లేవని అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్లు వివరించారు. తిరుమల ఆస్పత్రి వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.
చదవండి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఈడీ దూకుడు, రూ.31 కోట్ల ఆస్తుల అటాచ్
వారిని విచారించి అసలు నిజాలు రాబడతామన్నారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టబోమని తెలిపారు. ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని వేస్తామన్నారు. అవయవాలతో చట్ట విరుద్ధంగా వ్యాపారం చేసే ఆస్పత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment