
సాక్షి, అమరావతి: శాసనసభలో బుధవారం మంత్రులు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. ఏపీ విద్యుత్ సుంకం సవరణ (ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్‌మెంట్) బిల్లును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నియంత్రణలో భాగంగా తెచ్చిన దిశ బిల్లు సవరణ చట్టాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ బిల్లు – 2020ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రతిపాదించారు.
పలు బిల్లుల ఆమోదం: రాష్ట్రంలో 10 వేల మెగావాట్లతో ఏర్పాటు చేస్తున్న సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి కోసం ఏపీ అసైన్డ్ భూముల చట్టం సవరణ బిల్లును రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందింది. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యవసాయ మండలి బిల్లును సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను (రెండో సవరణ) బిల్లు, వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలపై పన్ను విధింపు సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను (మూడో సవరణ) బిల్లులను అబ్కారీ, వాణిజ్య పన్నులశాఖ మంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు.
ఈ బిల్లులు పాస్ అయ్యాయి. పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టిన పశువుల మేత (తయారీ, నాణ్యత, అమ్మకం, పంపిణీ క్రమబద్ధీకరణ) బిల్లును సభ ఆమోదించింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించే బిల్లును మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలో రైతులు తమ భూములను ఆ ప్రాజెక్టులకు లీజుకు ఇచ్చుకునే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు.