
సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఆస్తుల జప్తు చట్టబద్ధం కాదని 2018లోనే మనీ లాండరింగ్ నిరోధక అప్పిలేట్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఆ ఉత్తర్వులు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేనందున, వాటిని ఎత్తివేస్తున్నట్లు అప్పట్లోనే స్పష్టం చేసింది. ఆస్తుల జప్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను మనీ లాండరింగ్ నిరోధక అప్పిలేట్ ట్రిబ్యునల్ 2018 ఫిబ్రవరి 13న తప్పు పట్టింది.
ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను, అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను ట్రిబ్యునల్ రద్దు చేసింది. ఆ ఆస్తులను అన్యాక్రాంతం చేయవద్దని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో వాటి జప్తు ఎంతమాత్రం అవసరం లేదని చెప్పింది. చార్జ్‌షీట్‌లోని ఆరోపణలను మనీ లాండరింగ్ చట్టం కింద నేరంగా భావించలేమని స్పష్టం చేసింది.