పరిపాలనా వికేంద్రీకరణతో ప్రజల ముంగిటకు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు ఎన్నికలు జరగడానికి 9 నెలల ముందు రాష్ట్రం ప్రగతిపథంలో ఉరకలు పెడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన కృషి అన్ని రంగాల్లో సత్ఫలితాలు ఇస్తోంది. సాధారణంగా ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా ఏ రాష్ట్రంలోని పాలకపక్షమైనా విజయాలు, వైఫల్యాలు బేరీజు వేసుకుంటూ ఆందోళనతో ముందుకు నడుస్తుంది. అయితే, ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో, విజయోత్సాహంతో ముందుకు సాగుతున్నారు.
2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 98.5 శాతం నెరవేర్చామని మూడున్నర నెలల క్రితం సీఎం గారు చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అన్ని రంగాల్లో ప్రభుత్వం తెచ్చిన మార్పుల ఫలితంగా ఏపీ 11.23 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు రూ.1,97,473 కోట్ల సొమ్ము అందజేసి ఈ ఏడాది బడ్జెట్ నాటికి ఏపీ సర్కారు నగదు బదిలీలో కొత్త రికార్డు సృష్టించింది. క్షేత్రస్థాయిలో ఐదున్నర కోట్ల ఆంధ్రులకు మేలు జరిగేలా 13 జిల్లాలను 26కు, 51 రెవెన్యూ డివిజన్లను 76కు పెంచింది. అలాగే టీడీపీ హయాంలో వైద్యకళాశాలలు 11 ఉండగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి సమంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
పారిశ్రామికాభివృద్ధికి వినూత్న ప్రాజెక్టులు
తోటి తెలుగు రాష్ట్రంతో పోల్చితే చారిత్రక కారణాల వల్ల పారిశ్రామిక రంగంలో అంత ముందు లేని ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేసే ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది. రాష్ట్రంలో బంగాళాఖాతం తీరం వెంబడి 800 కిలో మీటర్ల పొడవున విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) నిర్మాణం పూర్తయితే నవ్యాంధ్ర దక్షిణాదిలో పారిశ్రామిక కేంద్రంగా మారుతుంది. భారత దేశపు తొలి కోస్తా కారిడార్ అయిన తూర్పు తీర ఆర్థిక కారిడార్ (ఈసీఈసీ)లో అంతర్భాగంగా వీసీఐసీ ఏర్పాటవుతోంది. ఈ ఆర్థిక కారిడార్ ను ఉపయోగించుకుని ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక సంబంధాలు గణనీయంగా పెంచుకోవచ్చు.
‘మేకిన్ ఇండియా’ లక్ష్య సాధనకు వీసీఐసీ ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ కోస్తా కారిడార్ అభివృద్ధి ప్రణాళికలో కీలక భాగాలుగా విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, యేర్పేడు–శ్రీకాళహస్తి పారిశ్రామిక కేంద్రాలు పనిచేస్తాయి. 2019 నాటికి లక్షా పది వేలకు పైగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార (ఎంఎస్ ఎంఈ) యూనిట్ల సంఖ్య ఈ నాలుగేళ్లలో దాదాపు లక్షా 56 వేలకు పెరిగింది. అధికార వికేంద్రీకరణ, ప్రజా సేవల విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన పదిహేను వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలు, దాదాపు 11 వేల రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు ఆరొందలకు పైగా పౌర సేవలు అందిస్తున్నాయి.
వైఎస్సార్సీ సర్కారు పేరును తెలుగునాట చిరస్థాయిగా నిలిపే వాటంటీర్ల వ్యవస్థ ఎంతో డైనమిక్ పాత్ర పోషిస్తోంది. మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో 2,65,000 మంది వాలంటీర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వినూత్న రీతిలో సేవలందిస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఈ వాలంటీర్లు ఆంధ్ర జనానికి ఆసరాగా నిలుస్తున్నారు. ఈ కొత్త సేవల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటకు వచ్చినట్టయింది. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 9 నెలల ముందు ఇంత చలనశీలతతో, ప్రగతిశీలంగా పనిచేస్తున్న పాలకపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ 2024 ఏపీ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తుందన్నది ఆంధ్రప్రజల నోట ఈ మధ్య పదే పదే వినిపిస్తున్న మాట.
-విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment