MP Vijay Sai Reddy Article On Unique Popularity Of YSRCP - Sakshi
Sakshi News home page

విశేషమైన జనాదరణ ఒక్క వైఎస్సార్‌సీపీకే సాధ్యం..!

Published Tue, Jul 4 2023 3:33 PM | Last Updated on Tue, Jul 4 2023 6:37 PM

MP Vijay Sai Reddy Article On Unique popularity Of YSRCP - Sakshi

ఏ రాష్ట్రంలోనైనా నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా అక్కడి పాలకపక్షానికి 51 శాతం ప్రజాదరణ సాధ్యమేనా? అనే ప్రశ్నకు– జనరంజకంగా ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి ఇది సంభవమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా నిరూపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే– ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని మతాలు, కులాల ప్రజల మద్దతుతో జనసంక్షేమమే ఏకైక లక్ష్యంగా 2019 నుంచీ ముందుకుసాగుతున్న వైఎస్సార్సీపీకి 51 శాతం ప్రజల మద్దతు లభిస్తుందని తాజా సర్వేలో తేలింది.

ప్రసిద్ధ మీడియా సంస్థ టైమ్స్‌ నౌ నవభారత్‌ ఈటీజీతో కలిసి ఈ జనాభిప్రాయసేకరణ జరిపింది. లోక్‌ సభ ఎన్నికలకు ఏడాది ముందు దేశవ్యాప్తంగా జరిపిన ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ వరకూ చూస్తే: పాలకపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలోని మొత్తం 25 సీట్లలో 24 నుంచి 25 వరకూ రావచ్చని స్పష్టమైంది. అంతేగాక, పోలయ్యే మొత్తం ఓట్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ పార్టీకి 51 శాతం ఓట్లు వస్తాయని కూడా ఈ సర్వే సూచిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి కేవలం 36 శాతం ఓట్లే వస్తాయని ఈ సర్వే వివరించింది. 

నాలుగేళ్ల క్రితం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 49.95% ఓట్లు లభించాయి. టీడీపీకి 39.17% ఓట్లు దక్కాయి. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ లో ఏ ఎన్నికల్లో కూడా పాలకపక్షానికి దాదాపు 50% ఓట్లు రాలేదు. అలాంటిది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 49.95 శాతం ఓట్లు కైవసం చేసుకోవడం ఓ రికార్డు అయితే, పై సర్వే ప్రకారం ఇప్పుడు ఏపీ పాలకపక్షానికి 51 శాతం ఓటర్ల ఆమోదం లభించడం మరో ఘనవిజయం.

సాధారణంగా ఎంతటి గొప్ప రాజకీయ పార్టీ అయినా నాలుగేళ్లు అధికారంలో ఉన్న తర్వాత జనాదరణను స్వల్ప స్థాయిలోనైనా కోల్పోతుంది. కాని, ఇలాంటి సిద్ధాంతాలు, ఆనవాయితీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వర్తించవని తెలుగునాట రుజువైంది. అలాగే, అతి తక్కువ సీట్లతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన పూర్వపు పాలకపక్షం టీడీపీ రోజురోజుకూ జనం మద్దతు పోగొట్టుకోవడం పాలకపక్షం పనితీరుకు, సామర్ధ్యానికి తర్కాణం.

ప్రాంతీయపక్షాలకు పార్లమెంటు కన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు!
 టౌమ్స్‌ నౌ–నవభారత్‌ ఈటీజీలు కేవలం 2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ సర్వే నిర్వహించాయి. ఈ లెక్కన మరో తొమ్మిది నెలల్లో లోక్‌ సభతోపాటు ఏపీ శాసనసభకు జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్ల శాతం ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువ. దేశంలో ప్రాంతీయపక్షాలకు లోక్‌ సభ ఎన్నికల్లో కంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు సాధించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ సూత్రానికి భిన్నంగా పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఏపీ పాలక పార్టీ 50 శాతానికి మించి ఓట్లు సాధించబోతోందని ఈ సర్వే సూచిస్తోంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పటి నుంచి ప్రతి ఏటా ఏదో ఒక ప్రముఖ మీడియా సంస్థ జరిపించిన ప్రతి సర్వేలోనూ ఈ పార్టీకి మంచి జనాదరణ ఉందనే సర్వేల ఫలితాలు తెలిపాయి. ఇలా వరుసగా ప్రతి సర్వేలోనూ మెజారిటీ ప్రజల ఆదరణ పొందిన ఏకైక రాజకీయపక్షం కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే. ఎప్పటి మాదిరిగానే జగన్‌ ప్రభుత్వానికి, పాలకపక్షానికి మద్దతు ఇవ్వడంలో మహిళలు ముందున్నారని కూడా అనేక ఓపీనియన్‌ పోల్స్, సర్వేలు తేల్చిచెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ పథకాలు స్త్రీలకు గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలు అందించడమేగాక, మహిళా సాధికారితకు దోహదం చేయడం దీనికి కారణం. కొద్ది మంది పురుష ఓటర్లకయినా ఎప్పుడైనా తమ సామాజికవర్గం ఏమిటనే స్పృహ ఉండవచ్చేమో గాని, పాలకపక్షం సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా ఆంధ్రా మహిళలు కులాలు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎక్కువగా అభిమానిస్తున్నారని కూడా వరుసగా అనేక సర్వేలు చెబుతున్నాయి.


-విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement