
► ‘చీఫ్ జస్టిస్’ పిరికివాడులా కనిపిస్తున్నారు..
► ప్రవీణ్‌కుమార్ చివరికి రాయలసీమ రెడ్డే కదా (ఎట్ ద ఎండ్ దట్ క్రూక్ ఈజ్ ఏ రాయలసీమ రెడ్డి)..
► చెయిర్ (జడ్జి స్థానం)లో కూర్చుని ప్రభుత్వానికి అనుకూలంగా వాదిస్తున్నారు. చీప్ ఫెలో..
► ప్రవీణ్‌ను పంపించేయాలి (ప్రవీణ్ ఫెలో షుడ్ బీ షోన్ ద డోర్)..
► ఇంత విద్వేషపూరితంగా మాటల ఈటెలతో తూలనాడింది ఎవరినో కాదు.. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు సీజేను, ఓ జడ్జిని ఉద్దేశించి వాడిన పదజాలం..
► ఇలా బరితెగించి ఇంతగా దారుణంగా వ్యాఖ్యలు చేసింది కూడా ఎవరో కాదు..
► ఒకరు ప్రతిపక్ష నేత చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేశ్ అయితే.. ఇంకొకరు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు.
► రాష్ట్ర హైకోర్టులో ఇటీవల ఓ కేసుకు సంబంధించిన వాదనలను ఆన్‌లైన్‌లో వీక్షిస్తూ వీరిద్దరి మధ్య వాట్సాప్‌లో సాగిన చాటింగ్ ఇది.
సాక్షి, అమరావతి: విద్వేషపూరిత వ్యాఖ్యలతో సమాజంలో అలజడులు సృష్టించేందుకు యత్నిస్తున్న రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసు దర్యాప్తులో సీఐడీ అధికారులు పలు విస్మయానికి గురిచేసే వాస్తవాలను శోధించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రసంగాల వీడియోలు, వేలాదిగా వాట్సాప్ చాటింగ్‌లను విశ్లేషించడంతో ఈ కుట్ర మొత్తం బట్టబయలైంది. ఆయన సెల్‌ఫోన్‌లోని డేటాను విశ్లేషించిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికలోనూ ఇవి స్పష్టమయ్యాయి. సీఐడీ అధికారులు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆధారసహితంగా ఈ విషయాలన్నింటినీ నివేదించారు. నిన్న సీఎం జగన్ బెయిల్ రద్దుపై చంద్రబాబుతో రఘురామకృష్ణరాజు జరిపిన చాటింగ్ బయటకొస్తే.. తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ రఘురామ, చంద్రబాబు తనయుడు లోకేశ్ జరిపిన వాట్సాప్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. వీరు ఏకంగా న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. తమకు అనుకూలంగా లేకపోతే ఎంతటివారినైనా తొక్కేస్తాం అన్నట్లుగా సాగింది వీరి విద్వేషపూరిత చాటింగ్. వారి సంభాషణ ఇదిగో ఇలా..
తేదీ : ఏప్రిల్ 30
సందర్భం: హైకోర్టులో కేసు విచారణను ఆన్‌లైన్‌లో వీక్షిస్తూ..
రఘురామ: ఈ రోజు కోర్టు విచారణలో మీకు అంతా మంచే జరగాలి. అవసరమైతే మనం సుప్రీంకోర్టులో హౌస్‌మోషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ‘చీఫ్’ ఆఫ్ ఏపీ కాస్త పిరికివాడిలా కనిపిస్తున్నారు.
లోకేశ్: ఆయన పరిస్థితిని అర్థంచేసుకుంటారని అనుకుంటున్నా..
లోకేశ్: అడ్వొకేట్ జనరల్ (ఏజీ) మాట్లాడారా ? నేను కాస్త లేటుగా వచ్చాను. (ఆన్‌లైన్‌లో కోర్టు విచారణను వీక్షించేందుకు)
రఘురామ: చీఫ్ జస్టిస్ మన సీనియర్ న్యాయవాది వాదనకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నాకు నమ్మకం పెరుగుతోంది.
లోకేశ్: అవును. నాకు విషయం అర్థం అయ్యిందని ఆయన చెప్పి వాదనను కట్ చేశారు. పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రవీణ్‌కుమార్ ఉన్నట్లుగా అనిపిస్తోంది.
రఘురామ: చివరికి వచ్చేసరికి ఆయన రాయలసీమ రెడ్డి కదా (ఎట్ ద ఎండ్ దట్ క్రూక్ ఈజ్ ఏ రాయలసీమ రెడ్డి). కానీ, ఆయన్ను పట్టించుకోరు.
లోకేశ్: అలాగే, జరగాలని ఆశిద్దాం.
రఘురామ: చెయిర్ (న్యాయమూర్తి స్థానం)లో కూర్చుని ఆయన ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు. చీప్ ఫెలో.
లోకేశ్: అందుకు ఇంటర్నెట్ కనెక్షన్‌లో సమస్య వచ్చి ఆయన్ని దేవుడే కట్ చేశాడు. లోల్..! బసవ ప్రభు బాగా వాదిస్తున్నారు. మీ అంచనా ఏమిటి?
రఘురామ: ఏజీ ఇంకా వాదించాలి. ప్రవీణ్‌ను పంపించేయాలి (ప్రవీణ్ ఫెలో షుడ్ బి షోన్ ద డోర్)
లోకేశ్: ఏజీ ఇంకా మాట్లాడాలి. ప్రవీణ్‌కు బసవరాజ్ పాటిల్ బాగా సమాధానాలు ఇచ్చారు.
రఘురామ: చాలా బాగుంది. ఆయన స్టుపిడ్ ప్రవీణ్‌ను కూడా పొగుడుతూ మెల్లగా తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారు.
లోకేశ్: ఏజీ వాదిస్తున్నారు..
రఘురామ: ఇడియట్ ఇప్పుడే మొదలు పెట్టాడు. చీఫ్ సరైన ప్రశ్న వేశారు.
లోకేశ్: ఇది సరదాగా ఉంది. ఏజీని చితక్కొట్టేస్తున్నారు.
రఘురామ: చీఫ్ మనకు అనుకూలంగా ఉన్నారు.
లోకేశ్: మనకు అనుకూలంగా వస్తున్నట్లు కనిపిస్తోంది.
రఘురామ: అవును. చీఫ్ చాలా క్లియర్‌గా ఉన్నారు.
లోకేశ్: మూడో తేదీకి వాయిదా పడింది.
రఘురామ: అవును.
లోకేశ్: మూడో తేదీకి నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తాము ఉత్తర్వులు జారీచేస్తామని ఆయన (చీఫ్) ప్రభుత్వానికి చెప్పారు.
రఘురామ: ముందస్తు శుభాకాంక్షలు.
లోకేశ్: 3న
రఘురామ: అవును. ఆ రోజు లైవ్.. ఈ రోజు అడ్వాన్స్
లోకేశ్: సీజే ఆయన వెనుక ఒక తన్ను తన్నారు. ఏజీ వెనుక (సీజే ఈజ్ కిక్కింగ్ హిజ్ యాస్.. ఏజీ యాస్.. లోల్)