ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మా పాపకు మాటొచ్చింది
మాది నిరుపేద కుటుంబం. పెద్దలిచ్చిన రెండెకరాల భూమే మాకు బతుకుదెరువు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ మండలం జాజరకల్లు గ్రామంలో నేను, మా ఆయన జి.రామిరెడ్డి వ్యవసాయం చేసుకుంటున్నాం. మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఉమేష్ బెంగళూరులో డిప్లొమా చదువుతున్నాడు. అమ్మాయి శ్రావణి పుట్టుకతోనే మూగ, చెవిటి. ఆమెలో ఉన్న లోపాన్ని చూసి బాధతో కుంగిపోయేవాళ్లం.
పాపకు మాటలు రప్పించేందుకు ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. ఎలాంటి ఫలితం కనిపించలేదు. మూగమ్మాయి అంటూ హేళన చేస్తారనే భయంతో స్కూలుకు వెళ్లకుండా అప్పుడప్పుడు మొండికేసేది. సర్దిచెప్పి మేమే పంపేవాళ్లం. ఈలోగా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చింది. స్థానిక నాయకుల సలహాతో మా అమ్మాయి సమస్యను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఒక లేఖ ద్వారా తీసుకెళ్లాం.
సత్వరం స్పందించిన ముఖ్యమంత్రి.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా చేయించారు. ఇప్పుడు మా అమ్మాయికి మాటొచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బిడ్డకు నేను జన్మనిస్తే.. మేనమామగా సీఎం జగనన్న మాట్లాడే భాగ్యం కల్పించారు. మాలో ప్రాణం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– లక్ష్మీ, జాజరకల్లు (ఈ.రాధాకృష్ణ, విలేకరి, రాయదుర్గం)
జగనన్న సంక్షేమ ‘ఆటో’గ్రాఫ్
బతుకు తెరువుకోసం ఆటో నడుపుతుంటా. దాని ద్వారా వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు వాహనానికి మరమ్మతులు తప్పనిసరి. ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఇంకా కేసుల సంగతి సరేసరి. అలాంటి సందర్భాల్లో అప్పులు చేయడం తప్పనిసరి అయ్యేది. రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అప్పులు చేయాల్సిన బాధ తప్పింది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం యాళ్లవానిగరువుకు చెందిన నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది. ఈ సొమ్ముతో ఏటా ఇన్సూరెన్స్, ఆటో రిపేర్లు చేయించుకుంటున్నా. నాకు ఇద్దరు పిల్లలు. బాబు అభినయ్ ఐదో తరగతి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. పాప భవ్యశ్రీ స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది.
అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందుతోంది. నా భార్య మణికి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందింది. సున్నా వడ్డీ ద్వారా మరో రూ.2 వేలు బ్యాంక్ ఖాతాలో పడింది. వాటితో మా జీవనం సాఫీగా సాగిపోతోంది. ఇప్పుడు మాకు బతుకు భయం లేదు. – కలిగితి రమేష్, యాళ్లవానిగరువు (కె శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్)
సర్కారు సాయంతో స్వయం ఉపాధి
మాది వ్యవసాయ కుటుంబం. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట గ్రామంలో మాకు సుమారు రెండెకరాల పొలం ఉంది. మా ఆయన గోవింద్ వ్యవసాయం చేస్తారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అబ్బాయి. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం ఇంటి అవసరాలకు సరిపోయేది కాదు. పంట చేతికొస్తే సరేసరి. లేకుంటే అప్పులు చేయాల్సి వచ్చేది. దానిని తీర్చడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 చొప్పున నగదు అందుకున్నా. దీనికి మరికొంత నగదు కలిపి రెండు ఆవులు కొనుగోలు చేశా. రెండేళ్లుగా పాల ద్వారా రోజుకు రూ.400కు పైగా.. నెలకు రూ.12 వేలకు పైగా సంపాదిస్తున్నా.
రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు రూ.54 వేలు అందింది. దీంతో సాగుకు పెట్టుబడి ఇబ్బందులు తొలగాయి. 6 నెలల కిందట మా కుమార్తెకు వివాహం చేశాం. మా అబ్బాయి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాం. దానికి కారణం ఈ ప్రభుత్వమే. – ఎల్లపు వెంకటలక్ష్మి, విజయరామరాజుపేట (చప్పా రామలింగేశ్వరరావు, విలేకరి, బుచ్చెయ్యపేట)
Comments
Please login to add a commentAdd a comment