
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/గరికపాడు(జగ్గయ్యపేట): స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సంఘీభావంగా టీడీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ ర్యాలీకి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. చలో రాజమండ్రి పేరుతో ఆదివారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు చేపట్టిన ర్యాలీ చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఈ ర్యాలీ నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనాల యజమానులు, డ్రైవర్లపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముందస్తు భద్రత చర్యలో భాగంగా తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద శనివారం రాత్రి పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ ఎ.అజిత పర్యవేక్షణలో నందిగామ డీఎస్పీ జనార్దన్నాయుడు, సీఐ జానకిరామ్ ఆధ్వర్యంలో పికెట్ ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.
ర్యాలీ చేస్తే నిర్వాహకులపై చర్యలు: తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్
తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు సెక్షన్–144, పోలీస్ యాక్ట్–30 అమలులో ఉన్నందున ఎటువంటి ర్యాలీలు, యాత్రలు, ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ పి.జగదీష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ ప్రొఫెషనల్స్ పేరుతో చేపట్టిన కారు సంఘీభావ యాత్రకు ఎటువంటి అనుమతి లేదని, జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కారు యజమాని, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టంచేశారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తారని చెప్పారు. ఈమేరకు ఆర్టీవోకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జిల్లా ప్రజల ప్రశాంత జీవనానికి ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలను కాపాడాలని పోలీస్ అధికారులను ఆదేశించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment