
సాక్షి, అమరావతి: ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులకు భారత ఎన్నికల సంఘం కొత్త అవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ ఫామ్, అఫిడవిట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు, నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నామినేషన్లను జూన్ 6వ తేదీలోగా దాఖలు చేసుకోవాలని, నామినేషన్ల పరిశీలన 7వ తేదీన జరుగుతుందని, ఉపసంహరణకు 9 చివరి తేదీ అని మీనా తెలిపారు.