ఆ తల్లికి ముగ్గురు ‘సరస్వతులు’ | Overcame financial difficulties Excelled in education | Sakshi
Sakshi News home page

ఆ తల్లికి ముగ్గురు ‘సరస్వతులు’

Published Wed, Feb 7 2024 1:39 PM | Last Updated on Wed, Feb 7 2024 1:39 PM

Overcame financial difficulties Excelled in education - Sakshi

ఆమెకు ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భర్త విడిచిపెట్టాడు. అయినా, ఆమె కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. వచ్చిన కూలిడబ్బులతో పిల్లలను సాకింది. ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గురు కుమార్తెలను చేర్పించింది. చదువు విలువ తెలియజేసింది. తల్లి కష్టాన్ని కుమార్తెలు గుర్తించారు. చదువులో రాణించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వేళ పెద్దల అండదండలతో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికకాగా, మరొకరు పీహెచ్‌డీ చేస్తున్నారు. అమ్మనమ్మకాన్ని గెలిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

శృంగవరపుకోట: శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని. వీరిని విడిచి తండ్రి వెళ్లిపోయాడు. బంగారమ్మే కంటికి రెప్పలా సాకింది. భవన నిర్మాణ పనులు చేస్తూ వచ్చిన కూలి డబ్బులతో చదువులు చెప్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌ వరకూ చదివిన 2వ కుమార్తె రేవతిని ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో చదువు మానిపంచాలనుకుంది. 

టెన్త్‌లో అత్యంత ప్రతిభ చూపిన రేవతికి స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్‌.సత్యనారాయణ తన కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ లో ప్రవేశం కలి ్పంచారు. అత్యధిక మార్కులు సాధిస్తే భవిష్యత్‌లో కోరిన చదువుకు తనే ఖర్చు భరిస్తానంటూ భరోసా ఇచ్చారు. రేవతి ఇంటరీ్మడియట్‌లో 984 మార్కులు సాధించింది. ఎంసెట్‌లో ర్యాంక్‌ సాధించి గాయత్రి ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. 2019లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భర్తీచేసిన సచివాలయ ఉద్యోగాల్లో ధర్మవరం సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా పోస్టు సాధించింది. అంతటితో  వదిలేయకుండా ఏపీపీఎస్సీ పరీక్షలకు సాధన చేసింది.

 2023 ఆగస్టులో పరీక్ష రాసింది. నవంబర్‌లో విడుదలైన ఫలితాల్లో విజయం సాధించింది. రేవతికి ప్రస్తుతం జోన్‌–1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆర్‌డబ్ల్యూఎస్‌  ఏఈఈగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం రేవతి అక్క సరస్వతి ఏలూరులో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తుండగా, చెల్లెలు పావని పీహెచ్‌డీ చేస్తోంది. ముగ్గురు అమ్మాయిలు చదువులో రాణించడంతో తల్లి బంగారమ్మ సంతోషపడుతోంది. పిల్లలు సాధిస్తున్న విజయాలతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement