సత్యానంద నివాసముంటున్న గది
సాక్షి, పశ్చిమగోదావరి : ఆయనో గాంధేయ వాది.. బాపూజీపై ఎనలేని అభిమానం.. 12 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు.. ఉపాధ్యాయ వృత్తిని వదిలి గిరిజన సేవా సంఘం స్థాపించి సేవే పరమావధిగా జీవించారు.. దాతలు, విదేశీయులు, ప్రభుత్వం నుంచి విరాళాలు సేకరించి పెద్దెత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. గతమెంతో వైభవం కాగా.. ప్రస్తుతం దుర్భర స్థితిలో బతుకుతున్నారు. కొల్లాయి గుడ్డ, చేతికర్ర ధరించి గాంధీజీ స్ఫూర్తితో జీవనం సాగిస్తున్న ఆయన పేరు స్వామి సత్యానంద. అభినవ గాంధీగా, కర్మయోగిగా అడవిబిడ్డలు ఆయన్ను అభివర్ణిస్తుంటారు.
గాంధీజీ స్ఫూర్తితో..
పోలవరం మండలం గూటాలకు చెందిన అచ్చన్న, చంద్రమ్మ దంపతుల నాల్గో కుమారుడు సత్యానంద 1930లో జన్మించారు. చిన్నతనం నుంచి గాం«దీజీపై ఇష్టం పెంచుకున్న ఆయన బాపూజీ పుస్తకాలు చదువుతూ పెరిగారు. 12వ ఏట క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని గాంధీజీని దగ్గరగా చూశారు. 1944లో 8వ తరగతి చదువుతూ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. 1946లో గోపాలపురం మండలంలోని రాజంపాలెంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అదే ఏడాది బుట్టాయగూడెం మండలంలోని రామన్నగూడెం పాఠశాలకు బదిలీపై వచ్చారు. 1948లో ఉపాధ్యాయుల హక్కుల కోసం 32 రోజులపాటు నిరాహార దీక్ష చేసి, సమస్యలపై అప్పటి ప్రధాని నెహ్రూకు లేఖ రాశారు.
శిథిలావస్థకు చేరుకున్న సత్యానంద భవనం
ఆయన పేరుతో గ్రామం
బుట్టాయగూడెం మండలం రామన్నగూడెం సమీపంలోని చిన్న భవనంలో ఆయన సేవా సంఘాన్ని ఏర్పాటుచేశారు. అనంతర కాలంలో ఆ ప్రాంతంలో మరికొన్ని ఇళ్ల నిర్మాణం జరిగింది. స్వామి సత్యానంద సేవలను గుర్తించి ఆ గ్రామానికి ‘నందాపురం’ అని స్థానికులు పేరుపెట్టారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 200 కుటుంబాలకు పైగా ఉన్నాయి.
79 ఏళ్లుగా బాపూజీ బాటలో..
స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన ఆస్తులు దానధర్మాల నేపథ్యంలో కనుమరుగయ్యాయి. నాడు సిబ్బందితో కళకళలాడిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. విలువైన పుస్తకాలు చెదలు పట్టి పాడైపోయాయి. నా అనే వాళ్లు లేక శిథిల భవనంలో ఆయన జీవనం సాగిస్తున్నారు. 91 ఏళ్ల వయసున్న ఆయన క్విట్ ఇండియా ఉద్యమం నాటి నుంచి 79 ఏళ్లుగా గాంధీజీ వేషధారణలో బతుకుతూ కూరగాయలు, పండ్లు, రొట్టెలే ఆహారంగా తీసుకుంటున్నారు. శి«థిల భవనంలో విషసర్పాలు సంచరించే ప్రాంతంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు.
చెదలు పట్టిన విలువైన పుస్తకాలు
ఔదార్యం.. అమోఘం
దీనస్థితిలోనూ సత్యానంద తన ఔదర్యాన్ని వీడలేదు. ప్రభుత్వం అందిస్తున్న రూ.2,250 పింఛన్‌ను పేదల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఎవరైనా ఆయన్ను సన్మానించి నూతన వ్రస్తాలు అందిస్తే వాటినీ పేదలకు ఇచ్చేస్తున్నారు. తనకు వివాహమైనప్పటికీ కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు సత్యానంద చెబుతున్నారు.
ఉద్యోగాన్ని వదులుకుని..
1954లో గిరిజనులకు సేవ చేయాలనే తలంపుతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి గిరిజన సేవా సంఘం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాతలు, ప్రభుత్వం, విదేశీయుల సహకారంతో విరాళాలు సేకరించి పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థకు భవనాలు, భూమిని కూడా సమకూర్చారు. సుమారు 30 మందికి పైగా ఉద్యోగులతో సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో అక్షరాస్యత శాతం పెంపు, ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవకు కృషిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment