సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు అతడికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ కడప చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కమ్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి గత నెల 26న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ వివేకా హత్యకేసులో నిందితులు తుమ్మల గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి హైకోర్టులో గురువారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
కడప కోర్టు ఉత్తర్వులకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వారు హైకోర్టును ఈ సందర్భంగా అభ్యర్థించారు. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ, అతడిని అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇస్తూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కడప కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి, సాక్షిగా అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పులివెందుల కోర్టు రంగం సిద్ధం చేస్తోందని తెలిపారు. కడప కోర్టు ఉత్తర్వుల వల్ల తమకు తీరని నష్టం కలుగుతుందన్నారు.
రాజకీయ కుట్రలో భాగంగా వివేకా హత్యకేసులో అసలు నిందితులకు రక్షణగా దస్తగిరిని ముందు పెట్టారని ఆరోపించారు. దస్తగిరి చెప్పిన వివరాలన్నీ కట్టు కథలేనని, వాటిని కడప కోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది కాదని పేర్కొన్నారు. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన పిటిషన్ వెనుక కంటికి కనిపించని రాజకీయ కుట్ర ఉందన్నారు.
నేరాన్ని నిరూపించేందుకు సాక్ష్యాలు లేనప్పుడు మాత్రమే క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, సీబీఐ ఒకపక్క సాక్ష్యాలున్నాయని చెబుతూ, మరోపక్క దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్ వేయడం వెనుక ఉన్న కుట్రను కోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందన్నారు. వివేకా హత్యతో తమకు సంబంధం లేకపోయినా తమను ఈ కేసులో ఇరికించేందుకే సీబీఐ ఈ పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. కడప కోర్టు ఉత్తర్వుల వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేయాలని వారు హైకోర్టును అభ్యర్థించారు.
దస్తగిరికి అప్రూవర్‌గా అనుమతి.. చట్టవిరుద్ధం
Published Fri, Dec 3 2021 5:39 AM | Last Updated on Fri, Dec 3 2021 5:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment