పక్కా స్క్రిప్టు.. దోపిడీ కిక్కు! | A plan for a massive robbery under the guise of a new liquor policy | Sakshi
Sakshi News home page

పక్కా స్క్రిప్టు.. దోపిడీ కిక్కు!

Published Sat, Aug 17 2024 5:39 AM | Last Updated on Sat, Aug 17 2024 7:21 AM

A plan for a massive robbery under the guise of a new liquor policy

మద్యంలో భారీగా దండుకునేందుకు సర్కారు పెద్దల ఎత్తుగడ  

ఎక్సైజ్‌ శాఖకు మట్టి అంటకుండా ఏపీయూఐఏఎంఎల్‌ ద్వారా తతంగం 

టీడీపీ నేతల లిక్కర్‌ సిండికేట్‌కు తలుపులు బార్లా.. ‘కన్సల్టెన్సీ’కి మద్యం విధానం రూపకల్పన బాధ్యత 

చంద్రబాబు మార్క్‌ నిబంధనలతో టెండర్ల ప్రక్రియ.. అస్మదీయ కన్సల్టెన్సీ ఎంపికయ్యేలా అర్హత నిబంధనలు 

రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉండాలట! 

13న టెండరు నోటిఫికేషన్‌.. 17లోగా బిడ్ల దాఖలు.. నాలుగు రోజులే గడువు ఇవ్వడంలో ఆంతర్యమేంటి?

ఆన్‌లైన్‌లో కాకుండా బిడ్‌ దాఖలుకు స్వయంగా రావాలనడంలో మతలబు ఏమిటి? 

ఆ మరుసటి రోజే ప్రజెంటేషన్‌ ఎందుకు?  

ఇతర కన్సల్టెన్సీలు పోటీకి రాకుండా అడ్డుకునే కుట్రే కదా..?

సాక్షి, అమరావతి : కొత్త మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీశారు. అందుకోసం తన ట్రేడ్‌ మార్కు శైలి అయిన ‘కన్సల్టెన్సీ ఎంపిక’ పేరుతో ఎత్తుగడ వేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను టీడీపీ నేతల సిండికేట్‌ గుత్తాధి­పత్యం కిందకు తీసుకువచ్చేందుకు పక్కాగా పన్నాగం పన్నారు. 

ఈ కుట్రకు రాజ ముద్ర వేయించి, అనంతరం మద్యం విక్రయాల పేరుతో భారీగా దోపిడీకి పాల్ప­డాలన్నది ఆయన వ్యూహం. అందుకే మద్యం విధానం రూపకల్పన కోసం కన్సల్టెన్సీ ఎంపిక పేరిట డ్రామా ఆడుతున్నారు. మద్యం పాలసీ రూపొందించేందుకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఎక్సైజ్‌ శాఖ ద్వారా కాకుండా ‘ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీయూఐఏఎంఎల్‌) ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించడం విడ్డూరం. 

మద్యం విధానం రూపకల్పనలో ఏపీయూఐఏఎంఎల్‌కు ఎలాం­టి అను­భవం లేదు. కేవలం ఎక్సైజ్‌ శాఖకు మట్టి అంటకుండా ఏపీయూఐఏఎంఎల్‌ ద్వారా కథ నడిపించాలని ఎత్తు­గడ వేశారు. తమ అస్మదీయ కన్సల్టెన్సీకి అనుకూ­లంగా నిబంధనలను రూపొందించి, పక్కాగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతూ సాగిస్తున్న కుతంత్రం ఇలా ఉంది. 

చంద్రబాబు ట్రేడ్‌మార్కు కన్సల్టెన్సీ కుట్ర 
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి, రాష్ట్రంలో యథేచ్ఛగా మద్యం దోపిడీకి పాల్పడిన విషయం అందరికీ గుర్తుంది. మద్యం దుకాణాలన్నింటినీ టీడీపీ నేతలు గుప్పెట పట్టడంతోపాటు పర్మిట్‌ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలదని.. ఏకంగా 43 వేల బెల్ట్‌ దుకాణాలు ఏర్పాటు చేసి ఎంఆర్‌పీ కంటే 25 శాతం అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడ్డారు. 

ఏటా రూ.2.50 లక్షల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.12.50 కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. దాంతో మద్యం దోపిడీకి అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతానికి మించి, మద్యం దుకాణాల ద్వారా దోపిడీకి పాల్పడేందుకు కుట్రకు తెరతీసింది. 

అందుకోసం చంద్ర­బాబు అండ్‌ కో ఇప్ప­టి­కే ఓ విధానాన్ని రూపొందించినట్టు సమాచారం. ఎక్సైజ్‌ పాలసీపై సమీక్ష పేరుతో చంద్రబాబు ఇప్పటికే కొత్త మద్యం విధానాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. కాగా శంఖంలో పోస్తేగానీ తీర్థం కాదన్నట్టు.. తాము రూపొందించిన విధానాన్ని ఓ కన్సల్టెన్సీయే ప్రతిపాదించిందని కనికట్టు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీయూ­ఐఏఎంఎల్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించారు.

బిడ్ల దాఖలుకు నాలుగు రోజులే గడువు
» తమ అస్మదీయ కన్సల్టెన్సీకే రాష్ట్రంలో మద్యం విధానాన్ని రూపొందించే కాంట్రాక్టు దక్కేలా స్క్రిప్ట్‌ రూపొందించారు. కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీయూఐఏఎంఎల్‌ రూపొందించిన అర్హత నిబంధనలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 

» టెండర్ల ప్రక్రియలో పాల్గొనే కన్సల్టెన్సీకి గత మూడేళ్లలో సగటున ఏటా రూ.100 కోట్లు టర్నోవర్‌ ఉండాలని నిబంధన పెట్టారు. ఇతర రాష్ట్రాల్లోగానీ, విదేశాల్లోగానీ ఆ మేరకు టర్నోవర్‌ ఉండొచ్చన్నారు. ఇంత భారీగా టర్నోవర్‌ ఉండాలనడానికి ఇది రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టు కాదని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

» కేవలం ఓ పాలసీ రూపొందించాల్సిన కన్సల్టెన్సీకి ఏటా రూ.100 కోట్ల టర్నోవర్‌ ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ కన్సల్టెన్సీకి ఇతర కన్సార్షియం ద్వారా రూ.100 కోట్లు టర్నోవర్‌ ఉందని రికార్డులు సృష్టించి ఉంటారు. అందుకే ఆ నిబంధన పెట్టారన్నది స్పష్టమవుతోంది. 

» కన్సల్టెన్సీ ఎంపిక కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం ప్రభుత్వ దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. సాధారణ టెండర్లకు 21 రోజులు, ఎంతటి స్వల్ప కాలిక టెండరుకు అయినా కనీసం 14 రోజులు గడువు ఇస్తారు. ఏపీయూఐఏఎంఎల్‌ మాత్రం ఆ నిబంధనను పట్టించుకోలేదు. 

»    ఈ నెల 13న టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చి.. బిడ్లు దాఖలు చేసేందుకు 16 వరకు తొలుత గడువు విధించింది. తర్వాత మరో రోజు పొడిగించి 17లోగా బిడ్లు సమర్పించాలని పేర్కొంది. కేవలం నాలుగు రోజుల గడువు ఇవ్వడమంటే ఇతర కన్సల్టెన్సీలు ఏవీ పోటీకి రాకూడదని వేసిన ఎత్తుగడేనన్నది స్పష్టమవు­తోంది. అంతేకాకుండా బిడ్లను స్వయంగా వచ్చి దాఖలు చేయాలని పేర్కొంది. ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వ లేదు. పైగా బిడ్లు దాఖలు చేసిన తర్వాత ఒక్క రోజులోనే ప్రజెంటేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది.

»  దూరప్రాంతంలో ఉన్న కన్సల్టెన్సీ సంస్థలు కేవలం నాలుగు రోజుల్లోనే బిడ్లను రూపొందించి.. తమ ప్రతినిధులను అమరావతికి పంపించి దాఖలు చేయడం.. అనంతరం ఒక్క రోజులోనే ప్రజెంటేషన్‌ ఇవ్వడం.. అన్నది మామూలుగా సాధ్యం కాదు. కేవలం ఇతర కన్సల్టెన్సీలు బిడ్లు దాఖలు చేయకుండా ఉండేందుకే ఇటువంటి అసంబద్ధ నిబంధనలు విధించారు. తద్వారా తమ అస్మదీయ కన్సల్టెన్సీకే అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఈ ఎత్తుగడ వేశారని ఎక్సైజ్‌ శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement