కొత్త పుస్తకాలు వచ్చేశాయ్‌! | Prepared textbooks for students in government schools | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు వచ్చేశాయ్‌!

Jul 11 2021 4:24 AM | Updated on Jul 11 2021 4:24 AM

Prepared textbooks for students in government schools - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే నిమిత్తం ప్రభుత్వం ముద్రించిన కొత్త పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకూ చేరుకున్నాయి. అక్కడి నుంచి మండల కేంద్రాలకు తరలించే కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలైంది. ఎంఈవోల నుంచి పాఠశాలలకు తరలించి.. విద్యార్థులు స్కూళ్లకు రాగానే 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించిన జగనన్న విద్యాకానుక కిట్లతో కలిపి వారికి అందజేసేలా చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశం మేరకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.  

3.48 కోట్ల పుస్తకాలు రెడీ 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పంపిణీ చేసేందుకు 3,48,54,791 పుస్తకాలను సిద్ధం చేశారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా అన్ని రంగాల్లో పనులు స్తంభించడం, మందగించడం వంటి పరిస్థితులు ఏర్పడి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా మారింది. ఈ  తరుణంలోనూ పాఠశాల విద్యాశాఖ వాటిని అధిగమించి పిల్లలకు సకాలంలో పాఠ్య పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయించడం విశేషం. పాఠశాలలు అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా వల్ల జూలై 1 నుంచి ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ వల్ల  కేవలం టీచర్లు మాత్రమే రోజు విడిచి రోజు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆగస్టు రెండో వారం తరువాత స్కూళ్లలో తరగతులు దశలవారీగా ప్రారంభమయ్యేలా కార్యాచరణను రూపొందించారు.  

పూర్తిస్థాయిలో ఫస్ట్‌ సెమిస్టర్‌ పుస్తకాలు 
ప్రస్తుతం అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఫస్ట్‌ సెమిస్టర్‌ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించనున్నారు. 1–5 తరగతులకు మూడు సెమిస్టర్లు ఉండగా.. 6, 7, 8 తరగతులకు రెండు సెమిస్టర్లు ఉన్నాయి. 9, 10 తరగతులకు ఒకే సెమిస్టర్‌ విధానం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన మొత్తం పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయి జిల్లాలకు చేరాయి. మొత్తం 13 జిల్లాలకు కలిపి 3,31,39,341 పాఠ్య పుస్తకాలకు గాను 3,19,62,419 పాఠ్యపుస్తకాల ముద్రణ ఆయా ప్రింటింగ్‌ సంస్థలు పూర్తిచేసి జిల్లాలకు తరలించాయి. జిల్లాల్లో ఇప్పటికే 28,92,372 పాఠ్య పుస్తకాలు మిగులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన పాఠ్యపుస్తకాలు కలుపుకొని మొత్తం 3,48,54,791 పుస్తకాలు జిల్లాల్లో ఉన్నాయి. గతంలో టీడీపీ హయాంలో  నవంబర్, డిసెంబర్‌ వరకు కూడా పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందేవి కావు. కానీ.. ఇప్పుడు పాఠశాలలు తెరిచే నాటికే సిద్ధం చేయించడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement