ఉదయం బహిరంగ సభ ప్రకటన
సాయంత్రానికి రోడ్డు షోగా మార్పు
రాత్రికి ఆ రెండూ రద్దయినట్లు వెల్లడి
సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని వార్తలు వెలువడ్డాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభల్లో పాల్గొంటారని ఆ మూడు పారీ్టల నేతలు హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విశాఖలో మోదీ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని స్థానిక బీజేపీ నేతలకు సమాచారం వచ్చింది.
దీనిపై బీజేపీ నాయకులు సమాలోచనలు చేస్తుండగా మోదీ బహిరంగ సభ రద్దయిందని, ఒక రోజు ముందుగానే 15వ తేదీన విశాఖలో రోడ్డు షో నిర్వహిస్తారని సాయంత్రానికి కబురు అందింది. దీంతో రోడ్డు షో నిర్వహణపై వీరు సమావేశమై సమాలోచనలు చేశారు. ఎన్‌ఏడీ జంక్షన్–కంచరపాలెం వరకు గాని, బీచ్ రోడ్డులో కోస్టల్ బ్యాటరీ/నోవాటెల్ హోటల్ జంక్షన్ నుంచి పార్క్ హోటల్/వుడా పార్క్ వరకు గాని రోడ్డు షో నిర్వహించాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చిస్తుండగానే రోడ్డు షో కూడా రద్దయిందని రాత్రి 9 గంటలకు సమాచారం వచ్చింది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దయిందని సమాచారం అందిందని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర సోమవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment