పుర సమరానికి సింహపురి సన్నద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వ్యూహాలు తెరపైకి వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లోనూ విజయఢంకా మోగిస్తున్న అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ పుర ఎన్నికల్లోనూ సత్తా చాటి క్లీన్ స్వీప్ చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. టీడీపీ కనీసం పరువు దక్కించుకునే రీతిలోనైనా పోరాటం చేయాలని చర్చలు చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, గ్రేడ్–1 మున్సిపాలిటీలు గూడూరు, కావలిల్లో పుర రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు ఎస్‌ఈసీ ఆదివారం రిటర్నింగ్ అధికారులను నియమించడంతో పుర పోరు షురూ అయింది. జిల్లాలో నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి నెల్లూరు, గూడూరు, కావలి పుర ఎన్నికలపై కోర్టుల్లో వ్యాజ్యాలు ఉండడంతో వాయిదా వేశారు. మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడంతో అధికార వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది.
తాజాగా బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరులను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయడంతో వాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టడంతో అడ్డంకులు తొలగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పురాల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ కసరత్తు చేస్తుండడంతో నెల్లూరు పాటు కావలి, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు పురాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వ్యూహాలు తెరపైకి వచ్చాయి.
చదవండి: (టీడీపీ నేతతో బీజేపీ మంతనాలు)
వైఎస్సార్‌సీపీ సమరోత్సాహం
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేసిన వైఎస్సార్‌సీపీ ఆ తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్, పుర ఎన్నికల్లోనూ అప్రతిహతంగా విజయాలను దక్కించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని అధిపత్యాన్ని సొంతం చేసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో పదవులన్నీ ఆ పార్టీ వశమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను మెచ్చిన ప్రజానీకం ఏ ఎన్నికలైనా ఏకపక్ష తీర్పు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 937 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 846 స్థానాలు వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిపి 91 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. పరిషత్‌లో 524 ఎంపీటీసీ స్థానాల్లో 472 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 46 మండల పరిషత్‌లు, 46 జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్‌లో ప్రతిపక్ష పార్టీ కండువా కనిపించకుండా పోయింది. తాజాగా నెల్లూరు కార్పొరేషన్, గ్రేడ్–1 మున్సిపాలిటీలు గూడూరు, కావలి, అల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీల్లో ఘన విజయం దక్కించుకోవాలనే దిశగా ఆ పార్టీ సమరోత్సాహంతో పావులు కదుపుతోంది.
వ్యూహాత్మకంగా అడుగులు
నెల్లూరు నగర పాలక సంస్థలో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించేందుకు మంత్రి పి అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఎన్నికలతో నిమిత్తం లేకుండా నగర ప్రజలకు చేరువయ్యే చర్యలు చేపట్టారు. ప్రజాహక్కు కార్యక్రమంతో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ పేదల ప్రజల ముంగిటకు వెళ్లగా, నేను–నాకార్యకర్త కార్యక్రమంతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కేడర్‌ను ఉత్తేజ పరుస్తున్నారు. ఈలోపు ఎన్నికల సంఘం నిలిచిపోయిన పురపాలక ఎన్నికలకు కసరత్తు చేస్తుండడంతో అభ్యర్థుల ఎంపిక చర్యలకు అధికార పార్టీ నాయకులు మంతనాలు సాగిస్తున్నారు. విజయఢంకా మోగించే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణాన వచ్చినా వెంటనే రంగంలోకి దిగాలనే దిశగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకున్న విశ్వాసంతో సునాయసంగా వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తామనే «ధీమాను వైఎస్సార్‌సీపీ వ్యక్తం చేస్తోంది.
టీడీపీలో ఎన్నికల భయం
జిల్లాకే ప్రతిష్టాత్మకమైన నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ అడుగు ముందుకు, రెండుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తుండడంతో పోటీ చేయడానికి టీడీపీ మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆదివారం ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారుల నియామకంతో మంత్రి, ఎమ్మెల్యే కార్యాలయాల్లో రాజకీయ సందడి నెలకొనగా, టీడీపీ కార్యాలయంలో ఆ సందడి కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment