సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల నుంచి తెలంగాణ హైకోర్టు శుక్రవారం మరొకరికి విముక్తి కలిగించింది. ఇండియా సిమెంట్స్‌కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చినందుకు ప్రతిగా జగన్ కంపెనీల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఆరోపిస్తూ సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది.
ఇండియా సిమెంట్స్‌పై సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకొనేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఎన్ శ్రీనివాసన్‌పై ఇదే ఆరోపణలతో సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా సిమెంట్స్‌పై కేసు కొనసాగించడం న్యాయం కాదని స్పష్టం చేశారు.
సీబీఐ చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను రికార్డ్ చేయలేదని సీజే జస్టిస్ భుయాన్ ఆక్షేపించారు. అందువల్ల ఇలాంటి ఉత్తర్వులు న్యాయ సమీక్షకు నిలబడవని తేల్చి చెప్పారు. గతంలో శ్రీనివాసన్‌పై కేసును కొట్టేసిన న్యాయమూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తీర్పులో పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీ ఓ కృత్రిమ వ్యక్తి అని, కంపెనీ వ్యవహారాలను చూసుకొనే వ్యక్తులు చేసే తప్పులకు కార్పొరేట్ కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని తెలిపారు. చట్టం స్పష్టంగా నిర్దేశిస్తే తప్ప వ్యక్తులు చేసే తప్పులకు కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు.
క్విడ్ ప్రో కో ఆరోపణలతో సీబీఐ కేసు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌కు కృష్ణా జలాలను అదనంగా కేటాయించడంతోపాటు కడపలో ఆ సంస్థ ఫ్యాక్టరీకి ఉన్న 2.5 ఎకరాల స్థలం లీజును పొడిగించినందుకు ప్రతిఫలంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టిందని ఆరోపిస్తూ ఆ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.
ఈ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఇండియా సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ జరిపారు. కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది చల్లా గుణరంజన్ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ భుయాన్... శుక్రవారం ఆ వివరాలను వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment