
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజన్–2047 పేరుతో చంద్రబాబు మరో కొత్త మోసానికి తెర తీశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. విశాఖ కేజీహెచ్‌లో సుమారు రూ.60 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి సోమవారం మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు తానే ఒక దార్శనికుడిగా ప్రకటించుకుంటున్నారని, ఆయన స్వయం ప్రకటిత దార్శనికుడు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మంచి చంద్రబాబుకు కనిపించదు, వినిపించదని దుయ్యబట్టారు. చంద్రబాబు సూచనల మేరకే పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. రుషికొండపై గతంలో ఎంత విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయో.. అదే విస్తీర్ణంలో ఇప్పుడు భవనాలు నిర్మిస్తున్నారని స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూనే భవనాల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కట్టడంలో తప్పు ఏముంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
వైద్య, ఆరోగ్య రంగంలో సరికొత్త విప్లవం
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన నాటినుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య విభాగం స్వరూపం పూర్తిగా మారిపోయిందని మంత్రి రజిని తెలిపారు. ఏకంగా రూ.3,820 కోట్లతో రాష్ట్రంలోని 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, టీచింగ్ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సుమారు రూ.8,500 కోట్లతో రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నామన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు గ్రామస్థాయి నుంచి అందాలనే లక్ష్యంతో ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో అన్ని స్థాయిల్లో ఆస్పత్రులను జగనన్న అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. ఉత్తరాంధ్రకు వెన్నెముక లాంటి కేజీహెచ్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏకంగా రూ.79 కోట్లతో ఆస్పత్రి అవసరాలకు పరికరాలు కొనుగోలు చేశామని చెప్పారు.
రూ.500 కోట్లతో నాడు–నేడు కింద కేజీహెచ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.12 కోట్లతో ఎమ్మార్ స్కానింగ్‌ను సమకూర్చామని చెప్పారు. రూ.46 కోట్లతో క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కలెక్టర్ మల్లికార్జునరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment