విజయపురిసౌత్ (మాచర్ల): రాష్ట్రంలో అద్భుతంగా వైద్యరంగాన్ని తీర్చిదిద్దుతున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలనే లక్ష్యంతో రామోజీరావు విషపురాతలకు దిగుతున్నారు. అలాంటి ఓ కథనాన్ని ‘చెట్టుకింద వైద్యం’ శీర్షికతో తన ఈనాడు పత్రికలో ప్రచురించారు. వాస్తవం ఏంటంటే.. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో చివరి సరిహద్దు గ్రామమైన విజయపురిసౌత్లోని పాత బస్టాండ్ ఎదురుగా రూ. 5 కోట్లతో 30 పడకల ఆసుపత్రి శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. 2021లో ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది. తర్వాత సంవత్సర కాలం పైగా కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయి. దీంతో తాత్కాలికంగా పక్కనే ఓ ప్రభుత్వ భవనంలో వైద్యులు సేవలు కొనసాగిస్తున్నారు.
ఓ పక్క పక్కా భవనం సిద్ధమవుతున్నా పట్టించుకోకుండా ఈనాడు పత్రిక కట్టుకథలు రాసింది. ఉత్తమ స్థాయి వైద్యులు ఆసుపత్రిలో పనిచేస్తూ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్నారు. గిరిజన తండాలు, సుమారు 15 సమీప గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చే పేషెంట్లు కూడా ప్రభుత్వ సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రామోజీకి మాత్రమే సేవలు కానరాక అక్కసు వెళ్లగక్కారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ఆసుపత్రి విషయంలో ఏమాత్రం పరిజ్ఞానం లేని లోకేశ్ విమర్శలు చేయడాన్ని స్థానిక నేతలు తప్పుబడుతున్నారు.
కమ్యూనిటీ ఆసుపత్రిగా చాలా కాలంగా సేవలు అందిస్తున్న విజయపురిసౌత్ ఆసుపత్రి భవనాలు శిథిలమైతే నాడు–నేడు కింద నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ రూ. 5 కోట్లు కేటాయించారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టటంతోపాటు 8 మంది వైద్యులు, ఓ రేడియోగ్రాఫర్, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది, 10 మంది శానిటరీ సిబ్బంది, ఓ జూనియర్ అసిస్టెంట్, ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సబార్డినేట్ను నియమించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా చుట్టుపక్కల తండాలు, గ్రామాలకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ఈనాడుకు కనిపించలేదు.
డిసెంబర్ ఆఖరుకల్లా కొత్త భవనం
ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణంలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలాఖరు కల్లా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చెందిన రెండు ప్రభుత్వ గృహాలలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. – కేపీ చారి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్.
Comments
Please login to add a commentAdd a comment