ఆశలతో ఉచ్చు.. ఎన్నో ఇళ్లలో చిచ్చు | Ramoji Rao Financial Crimes In Margadarsi Chit funds | Sakshi
Sakshi News home page

ఆశలతో ఉచ్చు.. ఎన్నో ఇళ్లలో చిచ్చు

Published Tue, Feb 27 2024 4:30 AM | Last Updated on Tue, Feb 27 2024 4:30 AM

Ramoji Rao Financial Crimes In Margadarsi Chit funds - Sakshi

సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి తోడుంటే ఆనందం మీవెంటే.. ఇళ్లు, కార్లు, ఫర్నీచర్, నగలు అన్నీ కొనుక్కోవచ్చు..’ ఇదీ టీవీ చానళ్లలో, హోర్డింగుల్లో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఊదరగొట్టే ప్రచారం. అది నిజమేనని నమ్మి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చేరిన చందాదారుల ఇళ్లల్లో ఆనందం ఆవిరవుతోందన్నది పచ్చి నిజం. కొత్త ఇళ్లు, కార్లు కొనుక్కోవడం దేవుడెరుగు.. ఉన్న ఇళ్లు, భూములు, బంగారం అమ్ముకుంటున్నా అప్పుల ఊబి నుంచి బయట పడటం లేదు. అందమైన కలలు చూపిస్తూ రామోజీరావు సామాన్యుల మెడకు చిట్టీల ఉచ్చు బిగిస్తున్నారు.

ఒక చిట్టీ అప్పు తీర్చడం పేరిట మరో చిట్టీలో చేర్పిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు. ఆస్తులు తెగనమ్ముకున్నా అప్పులు తీరవు.. సరికదా కాల్‌మనీ రాకెట్‌ను తలపిస్తూ మార్గదర్శి సిబ్బంది వేధింపులతో చందాదారుల కుటుంబాలు మానసిక క్షోభ అనుభవిస్తుండటం రామోజీ ఆర్థిక అరచాకాలకు నిదర్శనం. విజయవాడకు చెందిన ఓ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్‌ కుటుంబానికి ఇలాంటి క్షేభే మిగిలింది. ఈ వెటర్నరీ వైద్యుడి కుటుంబ సభ్యులు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌లో ఒక గ్రూపులో చందాదారుగా చేరారు.

ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చేర్చారు. ఆ చిట్టీ గ్రూపుల చందాలు చెల్లించడం కోసమంటూ మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తూ ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చూపించారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఏకంగా 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్‌గా చూపించారు. అనంతరం ఆ కుటుంబం ఆస్తులను గుంజుకున్నారు. ఆ వెటర్నరీ వైద్యుడు జీపీఎఫ్‌ డబ్బులు రూ.35 లక్షలతోపాటు పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించినా ఇంకా అప్పులు తీరనే లేదు.

కాల్‌మనీ రాకెట్‌ గుండాల మాదిరిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సిబ్బంది వచ్చి అల్లరి చేసి మరీ వారి ఇంటిని వేలం వేయించారు. అంతటితో రామోజీ ఆగడాలు ఆగలేదు. విదేశాల్లో చదువుతున్న ఆ వెటర్నరీ డాక్టర్‌ కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు.

ఆ చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మళ్లీ వేధింపులు మొదలు పెట్టారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది.. ఎలా వేలం పాటలో పాల్గొంది.. అసలు తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే లేదు. ఆమె పేరుతో మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ఉద్యోగులే మోసం చేశారు. 

తలలు అమ్ముకున్నా తీరని అప్పులు
జాతీయ బ్యాంకులుగానీ ప్రైవేటు బ్యాంకులుగానీ తమ ఖాతాదారుల ఆర్థిక పరిస్థితిని సహేతుకంగా అంచనా వేసి తదనుగుణంగా రుణాలు ఇస్తాయి. రుణాలు చెల్లించే స్థోమతను బట్టి ఒక పరిమితి విధిస్తాయి. దేశంలో ఏ ఆర్థిక సంస్థ అయినా ఈ నిబంధనను పాటించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మాత్రం అవేవీ పట్టించుకోదు. చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి కూడా వారి ఆదాయం, ఆర్థిక స్థోమతను మించి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తోంది. దాంతో వాయిదాలు చెల్లించలేక వారు అప్పుల ఊబిలో కూరుకుపోయి తమకున్న కొద్దిపాటి ఆస్తులను తమకు ధారాదత్తం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నారు.

అందుకు విజయవాడకు చెందిన ఓ టాక్సీ డ్రైవర్‌ దీనగాధే తార్కాణం. ఇతను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.2 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యునిగా చేరారు. తర్వాత మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేరితే ఆర్థికంగా కలసి వస్తుందని చెప్పడంతో మరో రెండు గ్రూపుల్లో సభ్యుడిగా చేరాడు. తర్వాత ఆయనకు తెలియకుండానే ఏకంగా 20 గ్రూపుల్లో సభ్యునిగా చేర్పించేశారు. నెలకు రూ.50 వేలు వాయిదాల కిందే చెల్లించాల్సిన పరిస్థితి సృష్టించారు.

చిట్టీ పాట పాడిన తర్వాత ప్రైజ్‌మనీ తీసుకునేందుకు ఆయన ఇచ్చిన ష్యూరిటీలను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఉద్దేశ పూర్వకంగానే కొర్రీలు వేసి తిరస్కరించింది. వాయిదాల బకాయిలు చెల్లించేందుకు తమకున్న ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. అసలు ఓ టాక్సీ డ్రైవర్‌ నెలకు రూ.50 వేలు చిట్టీ వాయిదాలు ఎలా చెల్లించగలరని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ విచక్షణతో యోచించి ఉంటే ఆయనకు అంతటి దుస్థితి ఏర్పడేది కాదు. కానీ రామోజీ లక్ష్యం ఆయనకు ఉన్న ఒక్క ఇంటిని గుంజుకోవడమే. 

బరితెగించి రామోజీ ఆర్థిక ఆగడాలు 
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల్లో అత్యధికులది ఇలాంటి దుస్థితే. రాజకీయంగా ఎలాంటి అండాదండా లేని వారు, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర మధ్య తరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని రామోజీరావు పక్కాగా తన కుట్రను అమలు చేస్తూ వారి ఆస్తులను కొల్లగొడుతున్నారు. అటువంటి చందాదారుల్లో చిట్టీల చందాలు చెల్లింపులో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి, వారిని మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తున్నారు. కొత్త చిట్టీ గ్రూపులో ప్రైజ్‌ మనీతో పాత చిట్టీ గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చని ఆశ చూపిస్తున్నారు.

మళ్లీ కొత్త చిట్టీ దగ్గరకు వచ్చేసరికి ష్యూరిటీల పేరుతోనో మరో రకంగానో కొర్రీలు వేసి మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. చాలా మంది చందాదారులకు తెలియకుండానే వారి పేరిట మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లు చిట్టీ పాటలు పాడేస్తున్నారు. ఆ ప్రైజ్‌మనీని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. అలా చందాదారులు తమకు తెలియకుండానే లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇక అప్పులు తీర్చడం వారి తరం కాదని నిర్ధారించుకున్న తర్వాత వారి ఇళ్లపై మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఉద్యోగులు దాడులు చేస్తున్నారు.

వారిని వేధిస్తూ.. సామాజిక గౌరవానికి భంగం కలిగిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దాంతో తమ ఆస్తులను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ పరం చేసి కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవాల్సిన అనివార్యత సృష్టిస్తున్నారు. కొందరి నుంచి ఆస్తి పత్రాలు, ఎల్‌ఐసీ బాండ్లు తీసుకుని మరీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. మరికొందరిని.. చిట్టీలు పాడినా పాట మొత్తం (ప్రైజ్‌మనీ) ఇచ్చేందుకు నెలల తరబడి తిప్పుతున్నారు.

ఇంకొందరి సంతకాలను ఫోర్జరీ చేసి మరొకరికి ష్యూరిటీలో చూపిస్తూ చిట్టీ మొత్తం ఇవ్వకుండా వేధిస్తున్నారు. చిట్టీ వాయిదా ఒక్క రోజు ఆలస్యమైనా రూ.500 జరిమానా వసూలు చేస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌.. తాము చెల్లించాల్సిన చిట్టీ పాట మొత్తాన్ని మాత్రం నెలల తరబడి జాప్యం చేస్తున్నా సరే ఒక్క రూపాయి వడ్డీ చెల్లించడం లేదు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేలాది మంది మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులు గగ్గోలు పెడుతున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో 50 శాతం వరకు ఇటువంటి బాధితులే ఉండటం రామోజీ మోసాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. 

యథేచ్ఛగా చట్టం ఉల్లఘన
► ఎవరైనా ఓ చందాదారుడు చిట్టీ పాట పాడిన తర్వాత తగిన ష్యూరిటీలు చూపించకపోతే... ఆ చిట్టీ పాటను రద్దు చేయాలి. ఆ చిట్టీ గ్రూపునకు మళ్లీ పాట(వేలం) నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆ నిబంధనను పాటించడం లేదు. ఆ చిట్టీ పాటను రద్దు చేయడం లేదు. కొత్తగా పాటను నిర్వహించడమూ లేదు. ఆ చిట్టీ పాట సక్రమంగా నిర్వహించినట్టు చూపిస్తూ ఆ ప్రైజ్‌మనీని వేరే ఖాతాల్లోకి మళ్లించేస్తోంది. ఆ చిట్టీ గ్రూపును యథావిథిగా కొనసాగిస్తోంది. దాంతో ఆ డిఫాల్టర్‌ చందాదారుడు తర్వాత నెలల వాయిదాలు కూడా చెల్లించాల్సినట్టు చూపిస్తూ అప్పుల ఊబిలోకి కురుకుపోయేలా చేస్తోంది. 

► వాయిదాలు చెల్లించలేని చందాదారుడిని డిఫాల్టర్‌గా చూపించాలి. అంతవరకు ఆ చందాదారు చెల్లించిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో వేసి కమీషన్‌ పోగా వెనక్కి ఇచ్చేయాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అలా చేయడం లేదు. ఆ డిఫాల్టర్‌ చందాదారు మొత్తాన్ని మరో చిట్టీ బకాయి కింద జమ చేసినట్టు చూపిస్తూ.. ఇంకా బకాయిలు చెల్లించాలని రికార్డుల్లో ఆ చందాదరుని రుణగ్రస్తునిగా చూపిస్తోంది. 

► ఎవరైనా ప్రైజ్‌మనీ తీసుకోని చందాదారు వాయిదాలు చెల్లించలేకపోతే డిఫాల్టర్‌గా ప్రకటించాలి. ఆ చందాదారునికి 14 రోజుల నోటీసు ఇచ్చి డిఫాల్టర్‌గా ప్రకటించినప్పటి వరకు చెల్లించిన వాయిదాలను ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఆ తర్వాత ఏడు రోజుల్లో ఆ మొత్తాన్ని నిర్దేశిత వడ్డీ రేటుతో కలిపి చెల్లించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఈ నిబంధనను పాటించడం లేదు. అటువంటి చందాదారులను ఉద్దేశ పూర్వకంగా డిఫాల్టర్లుగా ప్రకటించకుండా కొనసాగిస్తూ వారు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. 

► చిట్‌ఫండ్‌ చట్టం ప్రకారం ప్రతి చిట్టీ గ్రూపు దేనికదే ప్రత్యేకం. ప్రతి చిట్టీ గ్రూపు ఒక ప్రత్యేక కంపెనీ వంటిది. ఒక చిట్టీ గ్రూపు చందాదారుగా చెల్లించిన మొత్తాన్ని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు చూపించకూడదు. ఈ నిబంధనను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఉల్లంఘిస్తూ చందాదారులను ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యునిగా చూపిస్తూ... అన్ని చిట్టీ గ్రూపుల మొత్తాన్ని ఒకదానికి ఒకటి అనుసంధినిస్తూ చందాదారులను ఉద్దేశ పూర్వకంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. 

బాధితులకు అండగా చట్టం, ప్రభుత్వం
చిట్‌ఫండ్‌ కంపెనీల మోసాలు, ఆగడాల నుంచి బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేసేందుకు కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం సరైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. చిట్టీ గ్రూపుల డిఫాల్టర్‌ సభ్యుల విషయంలో అనుసరించాలిన నిబంధనలను కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 22లో విస్పష్టంగా పేర్కొంది. అయితే దశబ్దాలుగా ప్రభుత్వాలు పట్టించుకోని ఆ చట్టాన్ని వైఎస్సార్‌సీపీ పటిష్టంగా అమలు చేస్తోంది. చిట్‌ రిజిస్ట్రార్‌లతోపాటు ప్రభుత్వం వరకు వివిధ స్థాయిల్లో అప్పీలు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మార్గదర్శి అక్రమాలు, వేధింపులకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌తోపాటు ఇతర చిట్‌ఫండ్‌ కంపెనీల బాధితులు తమ సమస్యను తెలియజేసి న్యాయం పొందేందుకు ప్రత్యేక వ్యవస్థే ఉంది. కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 64 నుంచి 68 వరకు జిల్లా అసిస్టెంట్‌ చిట్‌ రిజిస్ట్రార్‌కు విస్తృత అధికారాలున్నాయి. ఆయనకు జ్యుడీషియరీ అధికారాలను చట్టం కల్పించింది. చందాదారులు తమకు చిట్‌ఫండ్‌ కంపెనీ మోసం చేసిందీ.. వేధిస్తోంది.. అని భావిస్తే తగిన ఆధారాలతో జిల్లా అసిస్టెంట్‌ చిట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

తాము సరైన ష్యూరిటీలు సమర్పించినా ఆమోదించడం లేదని, తమను డిఫాల్టర్‌గా ప్రకటించి అప్పటి వరకు చెల్లించిన వాయిదాలను వెనక్కి ఇవ్వాలని.. తమ సమ్మతి లేకుండానే ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించారని... తమ సంతకాలను ఫోర్జరీ చేశారని.. ఇలా ఎటువంటి సమస్యలపైన అయినా ఫిర్యాదు చేయవచ్చు. దానిపై జిల్లా అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ విచారించి తగిన చర్యలు తీసుకుంటారు.

ఆమేరకు ఆదేశాలు జారీ చేస్తారు. జిల్లా అసిస్టెంట్‌ చిట్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే బాధితులు రాష్ట్ర స్థాయిలో కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్లు 69, 70 ప్రకారం రాష్ట్ర చిట్స్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆదేశాలు ఇచ్చిన రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్‌ చేసి తగిన న్యాయం పొందవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement