త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ! | Sajjala Ramakrishna Reddy Says that CM Jagan meet with job unions Soons | Sakshi
Sakshi News home page

త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ!

Published Wed, Dec 15 2021 3:33 AM | Last Updated on Wed, Dec 15 2021 7:13 AM

Sajjala Ramakrishna Reddy Says that CM Jagan meet with job unions Soons - Sakshi

సజ్జలతో మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు

సాక్షి, అమరావతి: వేతన సవరణ సంఘం సిఫారసులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ తన సిఫారసులను ముఖ్యమంత్రికి అందజేసిన నేపథ్యంలో అందులోని అంశాలపై చర్చోపచర్చలు జోరందుకున్నాయి. అంతిమంగా త్వరలో ఉద్యోగ సంఘాల∙నేతలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. దీనికి ముందస్తుగా మంగళవారం పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. విడివిడిగా కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకున్న సజ్జల... ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా ఉన్నారని, కరోనా రాకుంటే ఈ పాటికే పీఆర్సీ ప్రకటించేవారని చెప్పారు.

కోవిడ్‌ కారణంగా ప్రభుత్వం ఏ రకంగా దెబ్బతిన్నదీ వారికి వివరించారు. గడిచిన రెండు సంవత్సరాల్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో రూ.22వేల కోట్లు కోవిడ్‌ కారణంగా తగ్గిపోయింది. దీనికితోడు కోవిడ్‌ నివారణ, నియంత్రణ కోసం మరో రూ.8వేల కోట్లు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. మొత్తంగా ఈ రెండేళ్లలో కోవిడ్‌ కారణంగా రూ.30వేల కోట్ల భారం ప్రభుత్వంపై అదనంగా పడింది. వీటికితోడు ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే... ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్‌ (మధ్యంతర భృతి) ప్రకటించింది. ఐఆర్‌ అమలు చేయటం వల్ల 2018–19లో రూ.52,512 కోట్లుగా ఉన్న జీతాలు, పెన్షన్ల వ్యయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.67,340 కోట్లకు చేరిపోయింది. ఇక శాతం పరంగా చూస్తే రాష్ట్ర సొంత ఆదాయంలో 2018–19లో 84 శాతంగా ఉన్న జీతాలు, పెన్షన్ల వ్యయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 111 శాతానికి చేరింది.

ఈ పరిస్థితిల్లో ఫిట్‌మెంట్‌ను గనక మరింత పెంచితే దాన్ని భరించే పరిస్థితి ఉండదని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని సజ్జల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో చూసుకున్నా 2018–19లో జీతాలు, పెన్షన్ల కోసం పెడుతున్నది 32 శాతంగా ఉండగా 2020–21లో ఇది ఏకంగా 36 శాతానికి చేరిపోయింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ వ్యయం మన రాష్టంలోనే అత్యధికంగా ఉంది. ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాలని ఉద్యోగ సంఘాలను ఆయన కోరినట్లు సమాచారం. ఐఆర్‌ ఇవ్వడం వల్ల ఖజానాపై రూ.15,839.99 కోట్ల భారం పడగా... అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, శానిటరీ వర్కర్లు, ఎన్‌ఎన్‌ఎంలు, హోంగార్డులు.. ఇలా పలువురు ఉద్యోగులకు జీతాలు పెంచటాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.  

అయితే కార్యదర్శుల కమిటీ నివేదికలోని ప్రధాన అంశమైన 14.29 ఫిట్‌మెంట్‌ను అంగీకరించేది లేదని దాదాపు అన్ని సంఘాల నేతలూ నొక్కి చెప్పారు. దీనిపై తాము ముఖ్యమంత్రిని కలిసినపుడు చెబుతామని, ఆయన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ నేతృత్వంలో పలు సంఘాలు పాల్గొన్నాయి. అనంతరం రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన అంశాలను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.  
 
అసంతృప్తితో మెజారిటీ ఉద్యోగులు  
అధికారుల కమిటీ సిఫార్సులేవీ ఉద్యోగులు ఆశించిన రీతిలో లేవని సజ్జలకు చెప్పాం. మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని విన్నవించాం. 34 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరాం.  
– కాకర్ల వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 
 
ఉద్యోగులకు సీఎం మంచి చేస్తారని నమ్ముతున్నాం 
ఉద్యోగులకు సీఎం జగన్‌ మంచి చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఉద్యోగులకు 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. హామీలు అమలయ్యే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది.  – బండి శ్రీనివాసరావు, ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ 
 
55 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తేనే అంగీకరిస్తాం 
సీఎస్‌ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని సజ్జలకు తెలియజేశాం. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను రెండు జేఏసీలూ వ్యతిరేకించాయి. ఫిట్‌మెంట్, మానిటరీ బెనిఫిట్‌ అమలు, లబ్ధిపై తేడాలున్నాయి. సీఎం జగన్‌తో చర్చల్లో మేము దీనిపై స్పష్టత తీసుకుంటాం. 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తేనే అంగీకరిస్తాం. 
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి జేఏసీ చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 
 
ఫిట్‌మెంట్, మానిటరింగ్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలి 
2018 జూలై నుంచి ఫిట్‌మెంట్, మానిటరింగ్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని కోరాం. సెంట్రల్‌ పే కమిషన్‌ ప్రకారం.. ఫిట్‌మెంట్‌ అంగీకారం కాదని తెలిపాం.  
– సూర్యనారాయణ, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 
 
ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. 

ఏపీ మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్‌ సిబ్బందికి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం హర్షణీయం.  
– మోడల్‌ స్కూల్స్‌ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్, ఏపీఎంఎస్‌ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి.మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు టీవీ మార్కండేయ హనుమంతరావు 
 
సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ హర్షణీయం 
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సైతం కొత్త పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించడం హర్షణీయం.  
– గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.అంజన్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు విపర్తి నిఖిల్‌ కృష్ణ, సుజత్‌ భార్గవ్‌ కుమార్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement