తెనాలి : నది వంతెనపై ఆగిన రైలు.. సాంకేతిక సమస్య తో ముందుకు కదలనంటోంది.. సమయం గడుస్తోంది.. వెనక వచ్చే మెమో రైళ్లు ఆగిపోతున్నాయి.. మరికొన్ని నిముషాల్లో వచ్చే సూపర్‌ఫాస్ట్ రైళ్లకూ బ్రేకులు అని వార్యమైన వేళ.. అసిస్టెంట్ లోకో పైలట్ డ్రైవర్ చేసిన సాహసం.. ఉన్నతాధికారుల ప్రశంసలందుకుంది. దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ స్పాట్ అవార్డును గెలుచుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సీహెచ్‌వీపీ ఫణిబాబు రైల్వే శాఖలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా బెజవాడ డిపోలో చేస్తున్నారు.
ఈ నెల 22న చెన్నై– న్యూఢిల్లీ (నం.12615) సూపర్‌ఫాస్ట్ రైల్లో డ్యూటీలో ఉన్నారు. చెన్నై నుంచి బయలుదేరిన ఆ రైలు, ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో ఆ రాత్రి 8.14 గంటలకు తడ–సూళ్లూరుపేట మధ్యలో నిలిచిపోయింది. అది కూడా సరిగ్గా కళింగి నది వంతెనపై. లోపాన్ని సరిదిద్ద డం సాధ్యపడలేదు. వాక్యూమ్ పోతోంది.. సంబంధిత బోగీ దిగువ నుండే ఐసోలేషన్ కాక్‌ను లాక్ చేయాలి.. కిందకు దిగడానికి అక్కడ ఎలాంటి సైడ్ పాత్ వే లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక గార్డు, సిబ్బంది నిస్సహాయంగా ఉండిపోయారు.
పరిస్థితి గమనించిన రైలు డ్రైవర్(అసిస్టెంట్ లోకో పైలట్) సీహెచ్‌వీపీ ఫణిబా బు.. రైలు ఇంజన్‌లోంచి ఆ కోచ్‌కు వెళ్లి ఐసోలేషన్ కాక్‌ను లాక్ చేయడానికి సిద్ధపడ్డారు. బోగీ హ్యాండిల్స్, ఫుట్‌బోర్డు మెట్లను హత్తుకుని కిందకు వేలాడారు. ఏమాత్రం చేయి జారినా నదిలో పడిపోవడం ఖాయమని తెలిసినా.. భయప డలేదు. రైళ్లు ఆగిపోయి వేలాది ప్రయాణికులకు అసౌకర్యం కలగరాదన్న భావనతో తన విధి కాకున్నా ధైర్యం చేశారు.
15 నిమిషాల్లో ఐసోలేషన్ కాక్‌ను లాక్‌చేసి వ్యాక్యూమ్‌ను నిరోధించారు. దీంతో 9.05 గంటలకు జీటీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని ఆరంభించింది. తర్వాత వచ్చే సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఎలాంటి అవరోధం లేకుండా చేయగలిగారు. ఫణిబాబు సాహసం తెలుసుకున్న దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం శివేంద్రమోహన్, సీనియర్ డీసీఈ కొండా శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. ‘డీఆర్‌ఎం స్పాట్ అవార్డు’ను బుధవారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment