సాక్షి, అమరావతి: సైబర్ నేరాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ ఎస్పీ (సైబర్ నేరాలు) హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారు, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, నకిలీ వార్తలు, కించపరిచే వీడియోలు, వ్యాఖ్యలకు బాధ్యులు రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లోనూ ఎక్కడ ఉన్నా వారి ఆటకట్టిస్తామని చెప్పారు. ఈ నేరగాళ్లను పట్టుకొనేందుకు సీఐడీ విభాగం పరస్పర న్యాయ సహాయ ఒప్పందం ద్వారా ఇంటర్ పోల్, ఇతర దేశాలతో కలసి పనిచేస్తోందని చెప్పారు.
ఆయన శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు సైబర్ భద్రత కల్పించేందుకు సీఐడీ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధమైందన్నారు. ఆన్‌లైన్ ద్వారా వేధింపులు, ఆర్థిక మోసాలు, జూదం/బెట్టింగులు, సైబర్ బెదిరింపులు, ఉద్యోగ మోసాలు, వైవాహిక మోసాలు, రాన్సమ్‌వేర్, క్రిప్టో కరెన్సీ, ఆన్‌లైన్ రుణ మోసాలు మొదలైన అన్ని సైబర్ నేరాలను నిరోధించేందుకు సీఐడీ పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.
వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా ఫేక్ పోస్టులు, వార్తలు, ట్రోలింగ్‌లు, మార్ఫింగ్ వీడియోలు వంటివి పోస్టు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నిరోధించేందుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీపీపీఎస్) ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యేకంగా 60 మంది సైబర్ వలంటీర్లను కూడా నియోగించామన్నారు.
నకిలీ వార్తలు, దుష్ప్రచార పోస్టులను తొలగించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సైబర్ నేరాలు, దుష్ప్రచారాలపై రెండేళ్లలో ఏకంగా 23 వేల కేసులు నమోదు చేశామని, రూ.30 లక్షల వరకు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామని, 3 వేల మందిని మ్యాపింగ్ చేశామని తెలిపారు.
ఇటువంటి నేరాలను అరికట్టడంపై గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసు విభాగం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు విశాఖపట్నంలో అక్టోబరు 7, 8 తేదీల్లో సైబర్ హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు హర్షవర్థన్ రాజు చెప్పారు.
సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన వ్యవస్థలు
♦ ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్: 1930
♦ సైబర్ మోసాలను ఆన్‌లైన్‌లో నివేదించడానికి: cybercrime.gov.in
♦ సైబర్ నేరాలపై ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదుకు: cybercrimes& cid@ap.gov.in
♦ ఆన్‌లైన్ మోసాలపై ఫిర్యాదుల కోసం సీఐడీ వెబ్‌సైట్: cid.appolice.gov.in
♦ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు: itcore&cid@ap.gov.in
♦ ట్విట్టర్ ఖాతా ద్వారా ఫిర్యాదు చేసేందుకు:@apcidcyber
♦ యూట్యూబ్ చానెల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు: APCID4S4U
Comments
Please login to add a commentAdd a comment