సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులను మూసివేస్తూ ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబడుతూ హైకోర్టు పాలనాపరమైన అధికారం ద్వారా ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరపడంపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ) సెక్షన్లు 397, 401, 482, 483ల కింద ఉన్న అధికారాలను ఉపయోగించి హైకోర్టు పాలనాపరంగా సుమోటో చర్యలను ప్రారంభించడానికి వీల్లేదని నివేదించారు. హైకోర్టు పాలనాపరంగా తీసుకున్న నిర్ణయం ఆధారంగా సుమోటో చర్యలకు ఉపక్రమించడం న్యాయ చరిత్రలో ఇదే తొలిసారని వివరించారు. అసలు హైకోర్టు పాలనాపరంగా నిర్ణయం తీసుకోవడానికి, సుమోటో చర్యలకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో రిజిస్ట్రీ ఇప్పటి వరకు తమకు తెలియ చేయలేదన్నారు.
దేని ఆధారంగా సుమోటో చర్యలకు ఉపక్రమించారో చెప్పాలని రిజిష్ట్రార్(జుడీషియల్)ను కోరామని, అయితే ఆయన అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం ఆధారంగా సుమోటో చర్యలకు ఉపక్రమించారని చెప్పారే తప్ప, ఆ కమిటీ నివేదికను తమకు ఇవ్వలేదన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం తాలూకు అన్నీ వివరాలను తెలుసుకునే హక్కు తమకు ఉందన్నారు. ఆ వివరాలను తమకు అందుబాటులో ఉంచే వరకు ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న పోలీసులు, ఫిర్యాదుదారులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులకు నోటీసులు ఇవ్వవద్దని హైకోర్టును కోరారు. ఏజీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, నోటీసుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఫిర్యాదుదారులు అభ్యంతరం లేదంటనే మూసేశారు...
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2016లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే అమరావతి భూముల కుంభకోణం గురించి మాట్లాడారు. ఇందుకు గాను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణ జరిపిన పోలీసులు సాక్ష్యాలు లేకపోవడంతో వాటిపై ఆయా కోర్టుల్లో ఫైనల్ రిపోర్టులు దాఖలు చేశారు. దీంతో మేజిస్ట్రేట్లు ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేశారు. కేసులను మూసివేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఫిర్యాదుదారులు ఆయా కోర్టులకు నివేదించారు. దీంతో ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు ఆ కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చారు. వీటిని హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరపాలని పాలనాపరంగా నిర్ణయించింది. అందులో భాగంగా హైకోర్టు 11 సుమోటో పిటిషన్లను రిజిష్టర్ చేసింది. ఈ పిటిషన్లపై తాజాగా న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
అసాధారణం.. చట్ట ప్రకారం ఆమోదయోగ్యం కాదు
విచారణ ప్రారంభం కాగానే ఈ సుమోటో వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న పోలీసులు, ఫిర్యాదారులు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేస్తానని జస్టిస్ లలిత ప్రతిపాదించారు. దీనిపై ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై సుమోటోగా విచారణ జరపాలన్న అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం అసాధారణమన్నారు. ఇలా చేయడం హైకోర్టు సంప్రదాయం కాదన్నారు. గతంలో ఇలా జరిగిందా? అని తనకన్నా పెద్దలైన న్యాయవాదులను అడిగి తెలుసుకున్నానని, ఎన్నడూ హైకోర్టు ఇలా వ్యవహరించలేదని వారంతా తనకు చెప్పారన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఈ వ్యవహారాన్ని నివేదించినప్పుడు హైకోర్టు న్యాయపరంగా దానిని పరిశీలించి ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయం తీసుకుని ఉంటే అది వేరే విషయమని, కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందన్నారు. చట్ట ప్రకారం ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
నివేదిక మాకు ఇవ్వలేదు.. ఓ పత్రికలో మాత్రం వచ్చాయి
సుమోటో విచారణకు దారి తీసిన కారణాలు, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదికను హైకోర్టు తమకు ఇవ్వనేలేదని ఏజీ శ్రీరామ్ తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు తప్పన్న నిర్ణయానికి రావడానికి గల కారణాలను, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తమకు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అసలు హైకోర్టు తన సుమోటో పిటిషన్‌లలో ఎక్కడా అడ్మినిస్ట్రేటివ్ కమిటీ గురించి ప్రస్తావించలేదన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వివరాలు తెలుసుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ గురించి ఓ పత్రికలో మాత్రం అన్ని వివరాలు ప్రచురితమయ్యాయని, ఓ టీవీ చానల్ ఏకంగా 45 నిమిషాల పాటు చర్చా కార్యక్రమమే నిర్వహించిందన్నారు. మేజిస్ట్రేట్‌లపై అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చర్యలకు ఉపక్రమించిందని ఆ పత్రిక రాసిందన్నారు. దీన్ని బట్టి ఆ పత్రిక, టీవీ ఛానెల్ వద్ద అన్నీ వివరాలు ఉన్నట్లున్నాయన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం ఆధారంగా హైకోర్టు సుమోటో చర్యలు ప్రారంభించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు.
జస్టిస్ రాకేశ్ ప్రస్తావించిన కేసులపైనే ఇప్పుడు విచారణ...
గత ఏడాది ఓ కేసులో తీర్పు సందర్భంగా అప్పటి న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ అందులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వైఎస్ జగన్‌పై సీబీఐ కోర్టులో ఉన్న కేసులను ప్రస్తావించారని, అదే సమయంలో హైకోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతున్న సుమోటో కేసుల గురించి ప్రస్తావించారని శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు. జస్టిస్ రాకేశ్ కుమార్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని ఈ విషయాలను ఆయన చదివి వినిపించారు. జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిదన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇది పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు చేపట్టిన ఈ సుమోటో విచారణ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. అంతేకాకుండా హైకోర్టు గత 60 ఏళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయాలను ఉల్లంఘించడమే అవుతుందని నివేదించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసే ముందు ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అనంతరం దీనిపై నిర్ణయాన్ని న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment