సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రోజు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ముమ్మరం చేసింది. లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభకు ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటునకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలుండగా అందులో 50 శాతం మేర అంటే 23,090 పోలింగ్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నిర్ణయించింది.
ఇందులో భాగంగా 25 లోక్‌సభ నియోజకర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 23,090 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ స్ట్రీమింగ్ (ఆడియో, వీడియో, రికార్డు, వీక్షణ, సీసీటీవీ తదితర సేవలు అందించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే నెల 1వ తేదీలోగా ఆసక్తిగల సంస్థలు బిడ్‌లు దాఖలు చేయాల్సిందిగా స్పష్టం చేసింది. సాంకేతిక బిడ్‌ను వచ్చే నెల 2న, ఆర్థిక బిడ్‌ను వచ్చే నెల 3న తెరుస్తామని పేర్కొంది. ఎంపికైన బిడ్డర్ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏకకాలంలో జరిగే ఎన్నికల పోలింగ్ రోజు ప్రత్యక్ష వెబ్ ప్రసారాన్ని (ఆడియో–వీడియోతో కూడిన)టర్న్‌కీ ప్రాతిపదికన చేపట్టాలి.
ఇందుకు అవసరమైన వెబ్ అధారిత వెబ్ స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్‌తో పాటు సంబంధిత వస్తువులను సరఫరా చేయాల్సి ఉంటుంది. సురక్షిత క్లౌడ్ వాతావరణంలో సెటప్ చేసిన సర్వర్‌లోని ఆడియో–వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్‌తో సర్వర్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన స్థలాన్ని తప్ప ఎలాంటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం అందించదు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజు తగిన సిబ్బందితో సహా లైవ్ వెబ్ స్ట్రీమింగ్ చేయాలి. రికార్డు చేసిన బ్యాకప్‌ను సమర్పించాలి.
అలాగే రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో 55 ఇంచుల ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ రోజు ఒక్కో కార్యాలయంలో ఒక్కో సిబ్బంది ఉండాలి. మొత్తం 26 జిల్లాల ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో టీవీ స్క్రీన్స్‌ను అమర్చాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో రెండు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలి. నిరంతరాయంగా లైవ్ వెబ్ కాస్టింగ్ అందించడానికి అవసరమైన బ్యాటరీ బ్యాకప్ అందించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment